AP

కౌంట్ డౌన్, మేము సిద్దం – సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్..!!

ఎన్నికల రాజకీయం హీటెక్కుతోంది. సీఎం జగన్ – టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య హోరా హోరీ రాజకీయం కొనసాగుతోంది. సీఎం జగన్ ఈ రోజు భీమిలి వేదికగా ఎన్నికలకు సిద్దం అంటూ భారీ సభ ద్వారా ఎన్నికల సమరశంఖం పూరించనున్నారు. ఇటు చంద్రబాబు రా కదలిరా సభల ద్వారా సీఎం జగన్ ను టార్గెట్ చేస్తున్నారు.పీలేరు లో జరిగిన సభలో ముఖ్యమంత్రి పైన చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేసారు. మంత్రులు రోజా..పెద్దిరెడ్డి తీరు పైన ధ్వజమెత్తారు.

 

కీలక వ్యాఖ్యలు : ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్‌కు అభ్యర్థులు కూడా దొరకడం లేదన్నారు. జగన్‌ను ఇంటికి పంపడానికి యువత, రైతులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జగన్ అధికార అహంకారాన్ని దించడానికి ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికల అనంతరం వైఎస్సార్ పార్టీ జెండా పీకేయడం తప్పదని స్పష్టం చేశారు. ఇదే రాష్ట్రం, ఇదే ప్రజలు, ప్రభుత్వమే మారింది.. నాడు లేని పన్నులు ఇప్పుడు ఎందుకు పెరిగాయని ప్రశ్నించారు. నాడు లేని అప్పులు నేడు ఎందుకు పెరిగాయని నిలదీసారు. పేదవాడి బతుకు చితికిపోయింది. నిత్యావసర ధరలు పెరిగిపోయాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

 

జగన్ ఏం చేసారు: జగన్ పాలనలో అన్నమయ్య ప్రాజెక్టు గండి పడితే 40మంది కొట్టుకు పోయారని చంద్రబాబు మండిపడ్డారు. 400 ఇళ్లు దెబ్బతిన్నాయని, బాధితులకు నష్టపరిహారం చెల్లించారా ? ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుటుంబానికి లక్ష రూపాయలు తామే అందించామని అన్నారు. ఈ సీఎం రూ.10లు ఇచ్చి రూ.100లు దోచుకోవటం జగనన్న పాలసీ అని, బటన్ నొక్కాను, బటన్ నొక్కాను అని చెబుతున్నాడని, బటన్ నొక్కి ఎంత దోచుకున్నావో చెప్పాలని ప్రశ్నించారు. అవినీతి డబ్బుతో ఎన్నికల సభల కోసం పెద్ద పెద్ద ఫ్లెక్సీలు సిద్ధమని పెడుతున్నారని మండిపడ్డారు. జగన్‌ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.నాడు నాణ్యమైన కరెంటును రూ.200లకే మేము ఇస్తే.. ఇప్పుడు కరెంటు బిల్లు రూ.1000 కి పెరిగిందని, కరెంటు కోతలు పెరిగాయన్నారు.

 

మేము సిద్దం : యుద్ధం ప్రారంభమైంది. యుద్ధానికి తాము సిద్దమని తేల్చిచెప్పారు. కురుక్షేత్ర ధర్మ యుద్ధానికి జనసేన, టీడీపీ సిద్ధంగా ఉన్నాయన్నారు. 2019లో ముద్దులు పెట్టి బుగ్గలు నొక్కి మోసం చేశారన్నారు. ఒక్క అభివృద్ధి లేదు, ప్రాజెక్టు లేదు, పరిశ్రమ లేదని మండిపడ్డారు. రాయలసీమను రతనాల సీమగా మార్చాలనే టీడీపీ ప్రభుత్వం రూ.12,500 కోట్లు ఖర్చు పెట్టిందని, సాగునీటి ప్రాజెక్టులకు జగన్ ఒక్క పైసా ఖర్చు చేసారా అని నిలదీసారు. మంత్రి పెద్దిరెడ్డి పాపాలకు అంతు లేకుండా పోతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో పుంగనూరులో ఎలా గెలుస్తారో చూస్తానంటూ హెచ్చరించారు. మంత్రి రోజా వసూళ్ల పైన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. టీడీపీ, జనసేన ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేసారు.