ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనడానికి సన్నద్ధమౌతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే అయిదు విడతల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. మొత్తంగా 75 అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించింది.
ఇందులో సామాజిక సాధికారత కల్పించారు వైఎస్ జగన్. మహిళలు, యువతకు పెద్ద పీట వేశారు. కొన్నిచోట్ల కొత్తవారికి అవకాశం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తగిన ప్రాధాన్యతను కల్పించారు. సామాజిక సాధికారతే ఆయుధంగా ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మలి జాబితాలో అన్ని కులాల వారికీ ప్రాతినిధ్యాన్ని ఇచ్చారు.
తాజాగా ఆరో విడత జాబితాను విడుదల చేసింది. నాలుగు లోక్‌సభ స్థానాలు, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. అత్యంత ప్రతిష్ఠాత్మకం, కీలకంగా మారిన నర్సాపురం, గుంటూరు లోక్‌సభ స్థానాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ రెండింటితో పాటు రాజమండ్రి, చిత్తూరు (ఎస్సీ రిజర్వుడ్) లోక్‌సభ స్థానాలకూ ఇన్ఛార్జీలను నియమించింది వైఎస్ఆర్సీపీ.
పార్టీలో తిరుగుబాటు నాయకుడిగా గుర్తింపు పొందిన రఘురామ కృష్ణంరాజు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న నర్సాపురం లోక్‌సభ స్థానానికి అడ్వొకేట్ గూడూరి ఉమాబాల ఇన్ఛార్జీగా అపాయింట్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఇదే సీటు నుంచి రఘురామ కృష్ణంరాజు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం టీడీపీ జెండా ఎగురుతున్న గుంటూరు లోక్‌సభ ఇన్ఛార్జీగా ఉమ్మారెడ్డి వెంకటరమణను నియమించింది వైఎస్ఆర్సీపీ. రాజమండ్రికి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, చిత్తూరుకు ఎన్ రెడ్డెప్పను అపాయింట్ చేసింది.
కృష్ణా జిల్లా మైలవరం ఇన్ఛార్జీగా సర్నాల తిరుపతిరావు యాదవ్ పేరును ఖరారు చేసింది. ప్రకాశం జిల్లా మార్కాపురం ఇన్ఛార్జీగా అన్నా రాంబాబు, గిద్దలూరు- కే నాగార్జున రెడ్డి నియమితులయ్యారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంపై మరోసారి ప్రయోగానికి దిగింది వైఎస్ఆర్సీపీ. ఇదివరకు బీసీలకు కేటాయించిన ఈ స్థానాన్ని ఈ సారి మైనారిటీలకు ఇచ్చింది. డిప్యూటీ మేయర్ ఎండీ ఖలీల్‌ను అభ్యర్థిగా ప్రకటించింది.
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరుకు కే నారాయణ స్వామి, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గానికి బుట్టా రేణుకను అపాయింట్ చేసింది. ఈ మేరకు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.