AP

అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచే ప్రసక్తే లేదు- జనసేన సీనియర్ నేత బొలిశెట్టి..

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన మధ్య ఎట్టకేలకు సీట్ల పంపకాల వ్యవహారం తేలింది. 118 మంది అభ్యర్థులతో కూడిన కూటమి అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.

 

ఇందులో 94 నియోజకవర్గాల్లో టీడీపీ, 24 చోట్ల జనసేన అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. చంద్రబాబు, కింజరాపు అచ్చెన్నాయుడు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ వంటి ప్రముఖుల పేర్లు టీడీపీ జాబితాలో చోటు చేసుకున్నాయి. జనసేన తొలి జాబితాలో పవన్ కల్యాణ్ పేరు లేదు.

 

 

తమ పార్టీకి 24 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలను మాత్రమే కేటాయించడం పట్ల జనసేన క్యాడర్ భగ్గుమంటోంది. అనేక చోట్ల పార్టీ నాయకులు రాజీనామాలు చేస్తోన్నారు. తెలుగుదేశం పార్టీ జెండాలనూ తగులబెడుతున్నారు. నారా లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవడానికి చంద్రబాబు ఆడిన నాటకంగా విమర్శిస్తోన్నారు.

 

ఈ పరిణామాలపై జనసేన పార్టీ సీనియర్ నేత జనసేన పార్టీకి గౌరవప్రదమైన సీట్లను కేటాయించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. అలా జరక్కపోతే వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచే అవకాశమే లేదని స్పష్టం చేశారు. జనసేన అభ్యర్థులు లేని నియోజకవర్గాల్లో ఓట్లు బదిలీ కావాలంటే సీట్ల సంఖ్యను పెంచక తప్పదని అన్నారు.

 

జనసేనకు గౌరవప్రద స్థానాలను కేటాయించడం ఒక్కటే కాదని, పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు అధికారంలో వాటా సైతం ఇవ్వాల్సి ఉంటుందని బొలిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. టీడీపీ-జనసేన కూటమి ప్రభుత్వంలో తమకు ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

 

సీట్ల పంపకాల వ్యవహారంలో చంద్రబాబు దిగి రావాలని బొలిశెట్టి అన్నారు. జనసేనకు 40 సీట్లయినా కేటాయించాలని, లేకపోతే కూటమి గెలిచే అవకాశమే లేదని పునరుద్ఘాటించారు. 40 సీట్లయినా ఇవ్వకపోతే కాపుల నుంచి ఓట్లు టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో బదిలీ కాదని అన్నారు. కాపులు టీడీపీకి ఓట్లు వేయబోరని, జనసైనికులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని వివరించారు.