సార్వత్రిక ఎన్నిల ముందు ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి టీడీపీని వీడే యోచనలో ఉన్నట్టు సమాచారం అందుతుంది. . వచ్చే ఎన్నికల్లో పనబాక లక్ష్మి ఎంపీ సీటును ఆశిస్తున్నారు. కానీ టీడీపీ అధిష్టానం ఆమెకు టికెట్ ఇచ్చేలా కనిపించడం లేదు. పైగా పార్టీలో విపరీతమైన పోటీ నెలకొంది. దీనికి తోడు సర్వేల్లో పనబాక లక్ష్మి వెనుక పడటంతో ఈసారి చంద్రబాబు ఆమెకు టికెట్ నిరాకరించారని తెలుస్తోంది.
ఈ విషయం తెలుసుకున్న పనబాక లక్ష్మి టీడీపీ వీడాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. పనబాక లక్ష్మి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతారని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల ముందు టీడీపీలో చేరిన పనబాక లక్ష్మి తిరుపతి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తిరుపతి ఉప ఎన్నికల్లో సైతం మరోసారి చంద్రబాబు పనబాక లక్ష్మికి అవకాశం ఇచ్చారు. కానీ ఆ ఎన్నికల్లో సైతం పనబాక లక్ష్మికి ఓటమి తప్పలేదు.
మళ్లీ సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఆమె తిరుపతి ,బాపట్ల పార్లమెంట్ స్థానాలను కేటాయించాలని చంద్రబాబును కోరారు. అయితే పనబాక లక్ష్మిపై చేసిన సర్వేల్లో వెనుకడటంతో ఆమెకు సీటు నిరాకరిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీలో ఉండకూడదని ఆమె నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒకవేళ చంద్రబాబు టిక్కెట్‌ను నిరాకరిస్తే.. షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరడానికి పనబాక లక్ష్మి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
కాంగ్రెస్ పార్టీలో పనబాక లక్ష్మి ఒక వెలుగు వెలిగారు. ఆ పార్టీ నుంచి నాలుగు సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. మూడుసార్లు నెల్లూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2009లో బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2009లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. ఇప్పుడు ఆమె తిరిగి తన సొంత గూటికే చేరాలని చూస్తున్నారు.