AP

ఎన్నికల వేళ ఏపీలో బీజేపీ కీలక నిర్ణయం..

ఎన్నికలవేళ ఏపీలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టీడీపీ, జనసేనతో కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేస్తున్న బీజేపీ..అభ్యర్దుల ఎంపిక పైన కసరత్తు చేస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఢిల్లీలోనే మకాం వేసారు. పొత్తులో బీజేపీకి 6 ఎంపీ, 10 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించారు. కొన్ని మార్పులు కోరుతున్న బీజేపీ నాయకత్వం..తుది జాబితా ప్రకటన చేయనుంది. అటు బీజేపీ నాయకత్వం ఏపీలో ఎన్నికల బాధ్యతల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

 

బీజేపీ తాజా అడుగులు 400 సీట్లు టార్గెట్ గా బీజేపీ అడుగులు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోనూ సొంతంగా సీట్లు గెలవాలని యోచిస్తోంది. అందులో భాగంగా టీడీపీ, జనసేనతో 2014 తరహాలో పొత్తు పెట్టుకుంది. తాజాగా జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు. మూడు పార్టీలు కలిసి ప్రచారానికి సిద్దమవుతున్నాయి. బీజేపీకి కేటాయించిన సీట్ల లో మార్పులు, పోటీ చేసే వారి పేర్ల పైన బీజేపీ నాయకత్వంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి డిల్లీలోనే మకాం వేసారు. అక్కడ చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలోనే బిజెపి కేంద్ర నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ ఎన్నికల ఇన్చార్జిలుగా ఇద్దరు నేతలను నియమించింది.

 

ఇన్చార్జిల నియామకం ఎన్డీఏతో పొత్తు ఖాయమైన తర్వాత సీట్లు అభ్యర్థుల చర్చ కోసం కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ శకావత్ ఏపీకి వచ్చారు. చంద్రబాబు పవన్ తో చర్చించారు. ఆ సమయంలోనే బిజెపికి ఆరు ఎంపీ, 10 ఎమ్మెల్యే సీట్లు ఖాయం చేశారు. కానీ, ఆ బేటిలో టిడిపి ముద్ర ఉన్న నేతలకు సీట్లు ఖరారు చేస్తున్నట్లు వచ్చిన లీకులపై ఏపీ బీజేపీ నేతలు సీరియస్ అయ్యారు. పార్టీని నమ్ముకున్న సీనియర్లకు సీట్ల కేటాయించాలంటూ నాయకత్వానికి లేఖ రాశారు. ఫలితంగా ఇప్పుడు సీట్ల విషయంలో బిజెపి చర్చలు మొదలుపెట్టింది. ఎవరిని ఎక్కడ బరిలోకి దించాలని అంశంపై ఈరోజు లేదా రేపు నిర్ణయం ప్రకటించనుంది.

 

వారిదే కీలక పాత్ర ఏపీ బీజేపీ ఎన్నికల ఇన్చార్జిగా అరుణ్ సింగ్, సిద్ధార్థ నాథ్ సింగ్ లను నియమించిన పార్టీ నాయకత్వం వారిని ఏపీలోనే మకాం వేయాలని ఆదేశించింది. అభ్యర్థుల ప్రచారం, ఉమ్మడి మేనిఫెస్టో, ఎన్నికల హామీలు, కూటమి సమన్వయం, పార్టీ నేతలకు దిశా నిర్దేశం వంటివి చేసే బాధ్యతలను ఈ ఇద్దరు నేతలకు అప్పగించింది. దీంతో ఇక కూటమి వ్యవహారాలను బిజెపి అధినాయకత్వం ఇక్కడి పార్టీల మధ్య ఈ ఇద్దరు నేతలు సమన్వయం చేయనున్నారు. ,