AP

జగన్ Vs చంద్రబాబు, 66 లక్షల ఓట్ బ్యాంక్ – వణుకు మొదలు, సెల్ఫ్ గోల్..!

ఏపీలో ఇప్పుడు వాలంటీర్ల పై ఈసీ ఆంక్షల వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. ఎన్నికల వేళ పెన్షర్ల ఓట్ బ్యాంక్ ఎవరికి ఎన్నికల ప్రచార అస్త్రంగా మారుతోంది. చంద్రబాబు అండ్ కో ఫిర్యాదు కారణంగానే ఎన్నికల సంఘం వాలంటీర్ల పైన ఆంక్షలు విధించిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఆలస్యం కాకుండా పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు సీఎస్ ను కోరారు. 66 లక్షల లబ్దిదారులు ఉండటంతో ఎవరిని ముంచుతుందో అనే టెన్షన్ మొదలైంది.

 

పెన్షన్లు ఆలస్యం ప్రతీ నెలా 1వ తేదీన వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వటం గత 58 నెలలుగా జరుగుతోంది. కొత్తగా చేస్తున్న ప్రక్రియ కాదు. కానీ, తాజాగా ఎన్నికల సంఘానికి అందిన ఫిర్యాదుతో వాలంటీర్లను పెన్షన్ల పంపిణీ నుంచి దూరం పెట్టాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో, ఈ నెల నుంచి ఎన్నికల కోడ్ ముగిసే వరకూ అంటే మూడు నెలల పాటు పెన్షనర్లకు సంబంధిత సచివాలయాల్లో అందించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

దీని పైన పెన్షన్ దారులు ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వాలంటీర్లు తమ ఉద్యోగాలను రాజీనామాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో చంద్రబాబు అండ్ టీం చేసిన ఫిర్యాదుల కారణంగానే పెన్షన్లు అందటం లేదనే ప్రచారం జరుగుతోంది.

 

రాజకీయ దుమారం లబ్దిదారులు పెన్షన్ అందకపోవటం పైన వాలంటీర్లను ఆరా తీస్తున్నారు. జరిగిన పరిణామాలను వారు వివరిస్తున్నారు. లబ్దిదారులు టీడీపీ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు చంద్రబాబు మద్దతు దారులు చేసిన ఫిర్యాదు కారణంగానే వాలంటీర్లు వచ్చి పెన్షన్ ఇవ్వటం లేదని వైసీపీ శ్రేణులు బలంగా ప్రచారంలోకి తీసుకెళ్తున్నాయి.

 

వయోభారంతో ఉన్నవారు, వికలాంగులు తాము సచివాలయం వరకు రాలేమని..తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు పైన వస్తున్న వ్యతిరేకత గమనించిన టీడీపీ నాయకత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.

 

66 లక్షల ఓట్ బ్యాంక్ ఇదే అంశం పైన చంద్రబాబు పార్టీ శ్రేణులతో టెలి కాన్ఫిరెన్స్ నిర్వహించారు. పెన్షన్లు ఆలస్యానికి టీడీపీ కారణం కాదనే విషయం ప్రతీ లబ్దిదారుడికి వివరించాలని సూచించారు. తాము పెన్షన్లు అందించేలా చర్యలు తీసుకోవాలని రాసిన లేఖ గురించి చెప్పాలని నిర్దేశించారు. అయితే, వైసీపీ నేతలు మాత్రం వాలంటీర్ల వ్యవస్థ తో ఇంటి వద్దకే పెన్షన్ పంపే విధానం అమల్లోకి తెచ్చిందే తామని..ఇప్పుడు ఆపించింది చంద్రబాబు అంటూ చెప్పుకొస్తున్నారు.

 

పోటీలో ఉన్న అభ్యర్దులు ప్రచారంలోకి వెళ్లిన సమయంలోనూ లబ్దిదారుల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో..66 లక్షల లబ్దిదారులపైన తాజా పరిణామాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి..ఎవరి ఓట్లకు గండి పడతాయనే టెన్షన్ వీరిలో పెరిగిపోతోంది.