AP

జగన్ ఐదేళ్ల పదవీకాలం ముగిసే సమయానికి మొత్తం అప్పులు రూ. 11 లక్షల కోట్లు

పార్లమెంట్ వేదికగా ప్రకటించిన ఏపీ అప్పులపై టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయ రచ్చ మొదలైంది. కడప పర్యటనలో ఏపీ అప్పుల గురించి జగన్ మాట్లాడుతూ చంద్రబాబు హయాం కంటే తక్కువ అప్పు చేశామని అన్నారు. సరిగ్గా ఈ పాయింట్ మీద ఆయన్ను టీడీపీ నిలదీస్తుంది. కాగ్ లెక్కలను తీస్తే ఎవరు ఎన్ని అప్పులు చేశారో తెలుస్తుందని సవాల్ చేశారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. పార్లమెంటుకు తప్పుడు లెక్కలు ఏపీ ప్రభుత్వం ఇచ్చిందని ఆరోపించారు. అప్పులపై చర్చకు సిద్ధమని సవాల్ చేయటంతో రాజకీయం రసవత్తరంగా మారింది. టీడీపీ చెబుతున్న ప్రకారం 1956 నుంచి 2019 వరకు రాష్ట్రంపై మొత్తం అప్పుల భారం రూ.2.53 లక్షల కోట్లు. జగన్ మోహన్ రెడ్డి ఈ మూడున్నరేళ్లలో ఆ భారాన్ని రూ.6.38 లక్షల కోట్లకు పెంచారు. ఇది కాకుండా ఉద్యోగులకు జీతాలుగా చెల్లించాల్సిన బకాయిలు, కాంట్రాక్టర్లకు క్లియర్ చేయాల్సిన బిల్లులు వేల కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. ఆ మేరకు మాజీ ఆర్థిక మంత్రి యనమల బయట పెట్టారు. జగన్ ఐదేళ్ల పదవీకాలం ముగిసే సమయానికి మొత్తం అప్పులు రూ. 11 లక్షల కోట్లు దాటవచ్చని అంచనా వేస్తున్నారు.

టీడీపీ హయాంలో మొత్తం అప్పులు రూ.1,63,981 కోట్లు కాగా, అందులో ప్రధాన వాటా మూలధన వ్యయానికి కేటాయించారని రామకృష్ణుడు చెప్పారు. ఈ మూడున్నరేళ్లలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రుణాల్లో ఎక్కువ భాగం కేటాయించారని చెప్పారు. 2019-20 ఆడిట్ నివేదిక స్పష్టంగా రూ. 26,000 కోట్ల ఆఫ్-బడ్జెట్ రుణాలు బడ్జెట్‌లో ప్రతిబింబించలేదని, 2020-21 మరియు 2021-22లో కూడా ఆఫ్-బడ్జెట్ రుణాలను కాగ్‌కి కూడా సమర్పించలేదు. తద్వారా అప్పులను దాస్తున్నారు. కార్పొరేషన్లు బ్యాలెన్సులను పరిశీలించాలి. ఇవేమీ లేకుండా అబద్దాలు జగన్ చెబుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. గత తెలుగుదేశం పార్టీ (టీడీపీ) హయాంతో పోలిస్తే రాష్ట్ర అప్పుల వృద్ధి తక్కువగా ఉందని జగన్ మోహన్ రెడ్డి చెప్పటంపై మాజీ ఆర్థిక మంత్రి వై.రామకృష్ణుడు చర్చకు దిగారు. రాష్ట్రంపై ఉన్న అప్పుల భారంపై ముఖ్యమంత్రి బహిరంగ చర్చకు రావాలని రామకృష్ణుడు అన్నారు.