CINEMA

ఆస్కార్ అవార్డ్ పై సర్వత్రా ఆసక్తి….?

ఈసారి ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి మేగ్నమ్ ఓపస్ ‘ట్రిపుల్ ఆర్’లో కీరవాణి బాణీలకు చంద్రబోస్ రాసిన “నాటు నాటు…” పాటకు ‘ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఆస్కార్ రావడం ఖాయమని తెలుస్తోంది. మార్చి 12న ఆదివారం సాయంత్రం ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజెలిస్ లో జరగనుంది. మన భారతీయ కాలమానం ప్రకారం సోమవారం (మార్చి 13న) ఉదయం 5 గంటలకు ఉత్సవం ఆరంభమవుతుంది. ఈ నేపథ్యంలో నాలుగు సంస్థలు ‘ఆస్కార్ ప్రిడిక్షన్స్’ విడుదల చేశాయి. నాలుగు జాబితాల్లోనూ ‘ట్రిపుల్ ఆర్’లోని “నాటు నాటు…” పాటకే ఆస్కార్ ఖాయమని పేర్కొనడం విశేషం! మరి ఈ ప్రిడిక్షన్స్ జాబితాలకు విలువ ఉంటుందా? ఆస్కార్ ఓటింగ్ సరళిని గమనిస్తూనే, ఈ ప్రిడిక్షన్స్ సాగుతూ ఉంటాయి. అందువల్ల వీటిని కొట్టిపారేయవలసిన పనిలేదు. ఎటు చూసినా, ‘ట్రిపుల్ ఆర్’లోని “నాటు నాటు…” పాటకు ఆస్కార్ తప్పకుండా వస్తుందనే వినిపిస్తోంది. మన తెలుగునాట కొందరు ఈ అవార్డుల కోసం ఇంత ఖర్చు చేయాలా అన్న అంశాన్ని లేవనెత్తి మళ్ళీ ఈ పాటపై చర్చకు తెరతీశారు. ఈ నేపథ్యంలోనే ‘ఆస్కార్ ప్రిడిక్షన్స్’ జాబితాలో మన ‘నాటు నాటు…’ సాంగ్ కు అందరూ పెద్ద పీట వేయడం గమనార్హం!

 

‘లాస్ ఏంజెలిస్ టైమ్స్, కలైడర్ డాట్ కామ్, హిందుస్థాన్ టైమ్స్” వంటి మీడియా హౌస్ ల సర్వేలో “నాటు నాటు…” పాటకే అగ్రతాంబూలం లభించింది. కాబట్టి, ఆస్కార్ అవార్డు ఈ పాటకే దక్కుతుందని అత్యధికులు భావిస్తున్నారు. అలాగే మన దేశం నుండి ఆస్కార్ నామినేషన్స్ సంపాదించిన ‘ఆల్ దట్ బ్రీత్స్’, ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ చిత్రాలకూ ప్రిడిక్షన్స్ లో మంచి చోటే లభించింది. దర్శకుడు శౌనక్ సేన్ రూపొందించిన ‘ఆల్ దట్ బ్రీత్స్’ చిత్రం ‘బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్’ విభాగంలో నామినేషన్ సంపాదించగా, కార్తికి గాన్సాల్వెస్ తెరకెక్కించిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ సినిమా ‘బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్’ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్ సొంతం చేసుకుంది. ఈ రెండు చిత్రాలకూ ఆస్కార్ దక్కే అవకాశం ఉన్నట్టు ఈ ప్రిడిక్షన్స్ జాబితాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా ఓ తెలుగు సినిమా నుండి ‘ఒరిజినల్ సాంగ్’కు తొలిసారి నామినేషన్ దక్కించుకున్న ‘నాటు నాటు…’ పాటలో ఫోక్ రిథమ్, పీరియడ్ నేచర్, డాన్స్ వంటి అంశాలనూ పరిశీలనలోకి తీసుకున్నారని, అందువల్ల తప్పకుండా ఈ పాటకే ఆస్కార్ అవార్డు దక్కుతుందని అమెరికాలోని సినీవిశ్లేషకులు చెబుతున్నారు. సో… సోమవారం ఉదయం ఐదు గంటలకు ఇండియన్ మూవీ లవర్స్ టీవీలకు అతుక్కు పోవలసిందే!