హైదరాబాద్ వేదికగా ఎన్టీఆర్ శతజయంత వేడుకలు జరిగాయి. రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇదే సమయంలో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని పలువురు ముక్త కంఠంతో డిమాండ్ చేసారు.
ఎన్టీఆర్ కు భారతరత్న వచ్చే వరకూ పోరాడుతామని చంద్రబాబు ప్రకటించారు. ఈ సభలో నటుడు ఆర్ నారాయణ మూర్తి ఇదే అంశం పైన స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ సీఎం జగన్ పేరును ప్రస్తావించారు.
ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి : ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు ప్రసంగించారు. ఎన్టీఆర్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మచ్చ లేని నాయకుడుగా అభివర్ణించారు. ఎన్టీఆర్ అటు సినీ, ఇటు రాజకీయ రంగానికి తీసుకొచ్చిన గుర్తింపును ప్రశంసించారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ఒకే వేదిక పైకి వచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కు భారత రత్న పురస్కారం దక్కాలనేది ప్రధాన డిమాండ్ గా వినిపించింది. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఎన్టీఆర్ శత జయంతి నాడు ప్రతీ ఒక్కరు ఆయనను గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఎన్టీఆర్ కు సంబంధించి సావనీర్, వెబ్ సైట్ ను ఈ సభలో ఆవిష్కరించారు.
జగన్ పేరు ప్రస్తావనతో : వేడుకల్లో పాల్గొన్న నటుడు ఆర్ నారాయణ మూర్తి సభలో చేసిన ప్రసంగం ప్రత్యేకంగా నిలిచింది. ఎన్టీఆర్ కు భారత రత్న ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఆయనకు ఏం తక్కువని నిలదీసారు. దేశానికి సేవలు అందించిన ఎన్టీఆర్ కు భారత రత్న ఎందుకు ఇవ్వలేదు..ఆయనకు ఏం తక్కువ.. కేంద్రంతో కోట్లాడి తెచ్చుకోవాలని వ్యాఖ్యానించారు.
వంద రూపాయాల నాణెం పై ఆయన బొమ్మ వేసారని సరి పెట్టుకోవద్దని సూచించారు. కేసీఆర్, జగన్, చంద్రబాబు, సీపీఎం, సీపీఐ నేతంతా కలిసి ఎన్టీఆర్ కు భారతరత్న వచ్చేలా ప్రయత్నం చేయాలని డిమాండ్ చేసారు. నారాయణ మూర్తి తన ప్రసంగంలో జగన్ పేరు ప్రస్తావన చేయగానే సభకు హాజరైన వారి నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.
బాలయ్య-శివరాజ్ కుమార్ : ఈ సభకు జూ ఎన్టీఆర్ హాజరు కావటం లేదని సమాచారం ఇచ్చారు. హాజరవుతారని భావించినా జనసనాని పవన్ కల్యాణ్ హాజరు కాలేదు. రాం చరణ్ ప్రసంగం ఆకట్టుకుంది. ప్రభాస్, అల్లు అర్జున్ కు ఆహ్వానాలు ఉన్నా వేడుకలకు రాలేదు. కన్నడ నటుడు శివరాజ్ కుమార్ తన తండ్రి రాజ్ కుమార్, ఎన్టీఆర్ సోదరులుగా మెలిగేవారని గుర్తు చేసారు. బాలయ్యతో తనకు అదే అనుబంధం కొనసాగుతోందన్నారు. త్వరలోనే కలిసి సినిమా చేస్తామని వెల్లడించారు. వేడుకలకు హాజరైన వారిని చంద్రబాబు, బాలయ్యతో పాటుగా నిర్వాహకులు సత్కరించారు.