మార్గదర్శికి స్వల్ప ఉపశమనం. కేసు విచారణలో సిఐడి దూకుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. దానికి హైకోర్టు అడ్డుకట్ట వేసింది. మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు చేయడానికి వీలులేదని కోర్టు స్పష్టం చేసింది.
సిఐడియే కాకుండా ఇతర శాఖల అధికారులు తనిఖీలు చేయకూడదని ఆదేశించింది. ఒకవేళ చిట్స్ రిజిస్ట్రార్ తనిఖీ చేయాల్సి వస్తే 46/a నిబంధన అనుసరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సీఐడీ దూకుడుకు చెక్ పడింది.
మార్గదర్శిలో అక్రమాల పై గత కొద్ది రోజులుగా సీఐడీ విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సంస్థ వ్యవస్థాపకుడు రామోజీరావు ఏ1 గా, ఎండి శైలజాకిరణ్ ఎ2గా, ఇతర సిబ్బందిని నిందితులుగా చేర్చుతూ సిఐడి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మార్గదర్శి సంస్థ కూడా న్యాయపోరాటం చేస్తోంది. మరోవైపు తనిఖీల పేరిట ఏపీవ్యాప్తంగా ఉన్న 37 బ్రాంచ్ లో సిఐడి తో పాటు అగ్నిమాపక శాఖ హల్ చల్ చేసింది. అయితే ఈ తనిఖీలు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ మార్గదర్శి యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది.
మార్గదర్శి కోర్టులో బలమైన వాదనలు వినిపించింది. ఈ తనిఖీల్లో సిఐడి, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు నిబంధనలకు వ్యతిరేకంగా పాల్గొంటున్నారని కోర్టు దృష్టికి మార్గదర్శి న్యాయవాదులు తీసుకొచ్చారు. తనిఖీల పేరుతో సిబ్బంది విధులకు ఆటంకం కలిగిస్తున్నారని చెప్పుకొచ్చారు. రిజిస్ట్రార్,డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ మాత్రమే శాఖలను తనిఖీ చేయడానికి, రికార్డులను ధ్రువీకరించడానికి అధికారం కలిగి ఉన్నారని వాదనలు వినిపించారు.
దీంతో దీనిపై న్యాయస్థానం స్పందించింది.ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చింది. చందాదారులకు ఫోన్ చేసి వేధింపులు, బెదిరింపులకు పాల్పడకూడదని స్పష్టం చేసింది. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో సిఐడి దూకుడుకు బ్రేక్ పడింది. ఇప్పటివరకు ఈ కేసులో సిఐడిని యాక్టివ్ గా ఉంటూ వచ్చింది. ఖాతాదారులతో ఫిర్యాదు చేయించాలని తామే ప్రోత్సహిస్తున్నామని సిఐడి చీఫ్ సంజయ్ విలేకరుల సమావేశం పెట్టి మరి వెల్లడించారు. అయితే కోర్టు తాజా ఉత్తర్వుతో ఇక మార్గదర్శి జోలికి వెళ్లాలంటే సిఐడి కి కుదరని పనే.