APCINEMA

త్వరలో ప్రజా సేవలోకి ప్రభాస్ – ఎన్నికల్లో పోటీ, కృష్ణంరాజు సతీమణి క్లారిటీ..!!..

కృష్ణంరాజు కుటుంబానికి ఎంపీ సీటు ఆఫర్ వచ్చింది. మూడు పార్టీల నుంచి కృష్ణంరాజు సతీమణిని ఎన్నికల బరిలోకి దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో రాజకీయ ఎంట్రీ గురించి కృష్ణంరాజు సతీమణి శ్యామల క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ భవిష్యత్ కార్యక్రమాల గురించి తేల్చి చెప్పారు. గోదావరి జిల్లాల ప్రజలకు అండగా ఉంటామని స్పష్టం చేసారు. ప్రభాస్ సైతం ప్రజాసేవలోకి వస్తున్నారని శ్యామల కీలక వ్యాఖ్యలు చేసారు.

 

రెబల్ స్టార్ స్వర్గీయ కృష్ణంరాజు జయంతి కావటంతో కుటుంబ సభ్యులు మొగల్తూరులో సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసారు. ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సమయంలో కృష్ణంరాజు సతీమణి శ్యామల ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.

వచ్చే ఎన్నికల్లో కృష్ణంరాజు సతీమణి శ్యామలను తమ పార్టీ నుంచి నర్సాపురం నుంచి ఎంపీగాగా బరిలోకి దింపేందుకు వైసీపీ, బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కృష్ణంరాజు గతంలో బీజేపీ నుంచి ఎంపీగా, కేంద్ర మంత్రిగా పని చేసారు. బీజేపీ నాయకత్వంతో కృష్ణంరాజు కుటుంబానికి సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో, బీజేపీ నుంచి బరిలోకి దిగుతారంటూ కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. ఈ సమయంలో శ్యామల ఈ అంశాలపైన స్పష్టత ఇచ్చారు.

 

తమ కుటుంబం రాజకీయాల్లోకి వచ్చే అంశం ప్రజలే నిర్ణయిస్తారని శ్యామల చెప్పుకొచ్చారు. ప్రజాభీష్ఠం మేరకే రాజకీయ నిర్ణయం ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేసారు. కృష్ణంరాజు ఉన్న సమయంలో ఏ విధంగా ప్రజాసేవ చేసారో అదే బాటలో తాము ప్రజా సేవ కొనసాగిస్తామని స్పష్టం చేసారు.

 

హరో ప్రభాస్ గురించి ఆసక్తి కర అంశాలు వెల్లడించారు. ప్రభాస్ కూడా త్వరలో సేవా కార్యాక్రమాల్లో పాల్గొంటారంటూ శ్యామల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాము గోదావరి జిల్లాల్లో ప్రజలకు అండగా ఉంటామని శ్యామల చెప్పటం ద్వారా ప్రస్తుతం రాజకీయంగా కృష్ణంరాజు కుటుంబం ఎన్నికల్లో పోటీ చేస్తుందనే చర్చకు పరోక్షంగా మద్దతు లభించినట్లు విశ్లేషణలు మొదలయ్యాయి.