టాలీవుడ్ లో ఒక తరం ముగిసింది. సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం ఉదయం 4 గంటలకు మరణించారు. నటుడు, నిర్మాత, దర్శకుడు, స్టూడియో అధినేత టాలీవుడ్ ను వదిలి వెళ్లిపోయారు. సూపర్ స్టార్ కృష్ణ మరణం సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణకు నివాళులర్పిస్తూ ఎల్లుండి (గురువారం) షూటింగ్స్ బంద్ చేయాలని పిలుపునిచ్చింది.
మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు బుధవారం జరుగుతాయని ఘట్టమనేని కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్ మహాప్రస్థానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈరోజు, రేపు అభిమానుల సందర్శనార్థం కోసం ఆయన పార్థివదేహాన్ని గచ్చిబౌలి స్టేడియంలో ఉంచనున్నారు. సూపర్ కృష్ణ మృతిని సినీ అభిమానులు సైతం జీర్ణించుకోలేక పోతున్నారు. చాలా మంది ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వాసులు సైతం అంజలి ఘటించారు.
ఆయన మరణానికి సంతాపంగా నేడు (మంగళవారం) జిల్లా వ్యాప్తంగా అన్ని సినిమా థియేటర్లను మూసివేశారు. సినిమా ప్రదర్శన రద్దు చేసినట్లు జిల్లా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ వెల్లడించారు. అయితే.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట ఈ ఏడాది వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ సంవత్సరమే అయినవాళ్లను పోగొట్టుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో మహేష్ సోదరుడు రమేష్ బాబు అనారోగ్యంతో మృతి చెందారు. ఆ బాధ నుంచి తేరుకునేలోపే సెప్టెంబర్‌లో మహేష్ తల్లి ఇందిరాదేవి మరణించారు. ఈ క్రమంలో మంగళవారం తండ్రి కృష్ణ కన్నుమూయడం మహేష్ ని మరింత విషాదంలోకి నెట్టేసింది. దింతో మహేష్ బాబు అభిమానులు stay strong అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.