CINEMA

ప్రముఖ సినీ నటుడు, నిర్మాత అక్కినేని నాగార్జునకు గోవాలో షాక్

ప్రముఖ సినీ నటుడు, నిర్మాత అక్కినేని నాగార్జునకు గోవాలో షాక్ తగిలింది. గోవాలో అక్కినేని నాగార్జున కొన్ని నిర్మాణాలు చేపడుతున్నారు. అది కమర్షియల్ వినియోగం కోసం ఉద్దేశించిన ప్రాపర్టీగా తెలుస్తోంది. అయితే, నిర్మాణం సందర్భంగా సరైన అనుమతులు తీసుకోలేదనీ, నిబంధనల్ని ఉల్లంఘించారనీ ఆరోపణలు వస్తున్నాయి. పనులు ఆపకపోతే చర్యలు తప్పవ్… గోవాలోని మాండ్రేమ్ పంచాయితీ సర్పంచ్ పేరుతో అక్కినేని నాగార్జున కు నోటీసులు జారీ అయ్యాయి.

మాండ్రేమ్ పంచాయితీ సర్వే నెంబర్ 211/2బి ప్రాంతంలో ముందస్తు అనుమతి లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయని సర్పంచ్ అమిత్ సావంత్ నాగార్జునకు జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు. పనులు వెంటనే ఆపకపోతే పంచాయితీ రాజ్ చట్టం 1994 ప్రకారం చర్యలు తీసుకోబడతాయని కూడా మాండ్రేమ్ సర్జంచ్ అమిత్ సావంత్, అక్కినేని నాగార్జునకు జారీ చేసిన నోటీసుల్లో హెచ్చరించారు. గతంలో నాగార్జున హైద్రాబాద్‌లోనూ తెలంగాణ ప్రభుత్వం నుంచి అక్రమ నిర్మాణాలకు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.