National

రాహుల్ గాంధీ కేసు విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి

పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షపై స్టే విధించాలని కోరుతూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌పై విచారణ నుంచి గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి బుధవారం తప్పుకున్నారు. రాహుల్ గాంధీ తరపు న్యాయవాది పిఎస్ చంపనేరి ఈ కేసును అత్యవసరంగా విచారించాలని కోరుతూ హైకోర్టు న్యాయమూర్తి గీతా గోపికి విజ్ఞప్తి చేశారు. అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (AGP) వాదానలు వినిపిస్తూ ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదన్నారు. ఇరు పక్షాల వాదన విన్న జస్టిస్ గోపి కేసును ప్రధాన న్యాయమూర్తికి అప్పగించాలని కోర్టు రిజిస్ట్రీని ఆదేశిస్తూ కేసు నుంచి తప్పుకున్నారు.పరువు నష్టం దావా కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు శిక్ష విధించింది. సూరత్ కోర్టు తీర్పుపై మంగళవారం రాహుల్ గాంధీ(Rahul Gandhi) గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. రాహుల్ గాంధీ 2019 కర్టాటకలో జరిగిన లోక్ సభ ఎన్నికల ప్రచారంలో మోడీ ఇంటి పేరు వ్యాఖ్యలు చేశారు. దీనిపై సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. మార్చి 23న రాహుల్ గాంధీ దోషిగా తేలుస్తూ సూరత్ కోర్టు తీర్పు ఇచ్చింది. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అప్పిల్ చేసుకునేందుకు నెల రోజుల సమయం కూడా ఇచ్చింది. రాహుల్ గాంధీ తన శిక్షను నిలుపుదల చేయాలంటూ రాహుల్ గాంధీ చేసిన విజ్ఞప్తిని సూరత్ సెషన్స్ కోర్టు ఏప్రిల్ 20న తిరస్కరించింది. దీంతో రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టుకు వెళ్లారు. “సూరత్ కోర్టు ఇటీవలి తీర్పును సవాలు చేస్తూ మేము ఈ రోజు గుజరాత్ హైకోర్టులో దరఖాస్తు చేశాము” అని రాహుల్ గాంధీ తరఫు న్యాయవాది పంకజ్ చంపనేరి తెలిపారు. సూరత్ కోర్టు రాహుల్ ను దోషిగా తేల్చడంతో అతనిపై లోక్ సభ సెక్రటెరియట్ అనర్హత వేటు వేసింది. ప్రజాప్రతినిధుల చట్టం, 1951 (RP చట్టం) ప్రకారం రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఏదైనా నేరానికి శిక్ష విధించబడిన ఎన్నికైన ప్రజాప్రతినిధి తక్షణం అనర్హతను ఎదుర్కొంటారు.