National

ఛత్తీస్‌గఢ్ బస్తర్‌లో జరిగిన నక్సల్స్ దాడిలో 10 మంది పోలీసులతో పాటు ఒక డ్రైవర్ మృతి

ఛత్తీస్‌గఢ్ బస్తర్‌లో జరిగిన నక్సల్స్ దాడిలో 10 మంది పోలీసులతో పాటు ఒక డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే. మావోలు మందుపాతర పేల్చడంతో ఈ దారుణమైన ఘటన చోటుచేసుకుంది.

అయితే ఈ మందుపాతర పేల్చేందుకు మావోలు 50 కిలోల ఐఈడీ(IED)ని వినియోగించారు. పేలుడు ధాటికి పెద్ద ఎత్తున గోతి ఏర్పడింది.

డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్‌కు చెందిన పోలీసులు ఓ అద్దె వ్యానులో వెళుతుండగా ఈ ఘటన జరిగింది. పేలుడు ధాటికి కనీసం 20 అడుగుల ఎత్తుకు వాహనం ఎగిరి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రహదారి మధ్యలో ఏర్పడిన గోతి చూస్తే మావోలు ఎంత శక్తివంతమైన ఐఈడీ వినియోగించారో అర్థమవుతోందని అధికారులు అన్నారు.

దాదాపుగా 10రెట్లు శక్తివంతమైన పేలుడు పదార్థాలను మావోలు వినియోగించి ఉంటారని మేజర్ జనరల్ అశ్విని సివాచ్ చెప్పారు.ముందస్తు ప్రణాళిక ప్రకారమే వ్యాన్‌ను టార్గెట్ చేశారని ఆయన అన్నారు. దంతెవాడ అడవుల్లో కూంబింగ్ నిర్వహించి తిరిగి వస్తుండగా మావోలు పంజా విసిరారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న మావోల కోసం అడవిని పోలీసులు గాలిస్తున్నారు.

మందుపాతర పేల్చి అడవుల్లోకి మావోలు పారిపోయినట్లు సమాచారం. ఘటన జరిగిన ప్రాంతం మూడు రాష్ట్రాలకు జంక్షన్‌గా ఉంది. మావోలు ఆ ప్రాంతంపై పట్టుసాధించేందుకు ఈ ఘటనకు పాల్పడి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.గత కొద్ది కాలంగా భద్రతా దళాలు గట్టి గస్తీని ఏర్పాటు చేయడంతో మావోల కార్యకలాపాలు కాస్త నెమ్మదించాయి.తిరిగి ఉనికిని చాటుకునేందుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.

ప్రభుత్వం ఇస్తున్న హామీతో ఏటా 400 మంది మావోలు లొంగిపోతున్నట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. మావోయిస్టులు చాలామంది చత్తీస్‌గఢ్ రాష్ట్రంకు చెందినవారు కాదని, వారంతా తెలంగాణ, ఏపీ మరియు మహారాష్ట్ర వారని వివరించారు. ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.