National

భారత్ కి గుడ్ బై.. తిరిగి రాలేమంటున్న ప్రవాసులు

ప్రవాస భారతీయులంటే.. ఆరు నెలలకో, ఏడాదికో ఒకసారి భారత్ కి వచ్చి కుటుంబ సభ్యుల్ని, బంధువుల్ని చూసి వెళ్లేవారు.

ఇదంతా గతం. ఇప్పుటి ఎన్నారైలు నేరుగా కుటుంబంతోనే ఫ్లైటెక్కుతున్నారు. అక్కడికి వెళ్లాక ఇక తిరిగి రాలేమంటున్నారు. భారత పౌరసత్వం వదిలేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. కుటుంబంతో సహా విదేశాల్లోనే స్థిరపడిపోవాలని ఆలోచిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇంకా చెప్పాలంటే ఏడాదికేడాది భారత్ ని వీడిపోతున్న ప్రవాసుల సంఖ్యలో గణనీయమైన మార్పు వస్తోంది.

విద్య, ఉపాధి, వ్యాపారం.. తదితర కారణాలతో భారత్‌ నుంచి విదేశాలకు వెళ్లిన వారు అక్కడే స్థిరపడిపోవడానికి మొగ్గుచూపుతున్నారు. తమ పిల్లలు ఆయా దేశాల పౌరులుగానే పెరగాలని కోరుకుంటున్నారు. తెలుగు నేర్పిస్తున్నా, తెలుగు పండగల గురించి వారికి చెబుతున్నా, ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలను కొనసాగిస్తున్నా.. ఇక్కడికి మాత్రం తిరిగి వచ్చేందుకు ఇష్టపడటంలేదు. ఒక్క తెలుగు రాష్ట్రాలవారే కాదు, మిగతా అన్ని ప్రాంతాల వారిదీ ఇదే పద్ధతి. క్రమంగా భారత పౌరసత్వం వదులుకుని.. విదేశీ పౌరసత్వాలు పొందుతున్నారు వీరంతా.

విదేశాంగ శాఖ వివరాల ప్రకారం.. 2011 – 2022 అంటే దాదాపు 11 ఏళ్ల వ్యవధిలో 16.63 లక్షల మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకున్నారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, రష్యా సహా 135 దేశాల్లో వీరంతా స్థిరపడ్డారు. గతంలో భారత పౌరసత్వం వదులుకోడానికి ఎవరూ ఇష్టపడేవారు కాదు. ఎన్నాళ్లున్నా అది పరాయిగడ్డ అనే భావన వారిలో ఉంది. కానీ ఇప్పుడు గ్లోబలైజేషన్ వారి ఆలోచనను పూర్తిగా మార్చేసింది. భారత్ ఇక ఎంతమాత్రం తమ సొంత ప్రాంతం కాదనుకుంటున్నారు వారంతా. కేవలం జన్మభూమిగానే భారత్ ను పరిగణిస్తున్నారు. తమ పిల్లలు విదేశీ పౌరులుగానే పెరగాలని కోరుకుంటున్నారు.

భారీగా పెరిగిన వలసలు..

2019లో 1.44 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు.

2020లో 85వేల మంది మాత్రమే పౌరసత్వం రద్దు చేసుకున్నారు.

2021లో 1.63 లక్షల మంది మన దేశ పౌరసత్వాన్ని వదులుకున్నారు.

2022 నాటికి ఆ సంఖ్య 2.25 లక్షలకు చేరింది. అత్యధికంగా 2,25,260 మంది 2022లో భారత పౌరసత్వం వదులుకున్నారు.

చదువుల కోసం, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లాలనుకునేవారు.. తొలి ప్రాధాన్యం అమెరికాకే ఇస్తున్నారు. భారత పౌరసత్వం వదులుకున్న వారిలో ఎక్కువమంది అమెరికాలోనే స్థిరపడుతున్నారు. ఆ తర్వాత కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాలకు ఎక్కువగా వలస వెళ్తున్నారు.