APNational

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో మూడో రోజైన ఆదివారం ఉదయం పార్లమెంట్ నతూన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం జగన్.

ఇక ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై హోంమంత్రి అమిత్ షాతో జగన్ చర్చించినట్లు సమాచారం. మరోవైపు, న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శనివారం జరిగిన నీతి ఆయోగ్ ఎనిమిదవ పాలక మండలి సమావేశంలో సీఎం జగన్ పాల్గొన్న విషయం తెలిసిందే. దేశంలో ఆరోగ్యకరమైన పెట్టుబడుల ద్వారా మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తేనే ఆర్థిక వ్యవస్థ శీఘ్రగతిన పురోగమిస్తుందని ఏపీ సీఎం అభిప్రాయపడ్డారు.

నీతి ఆయోగ్ చర్చించే వివిధ అంశాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరిస్తూ ఒక నోట్ సమర్పించారు. దేశ జీడీపీలో తయారీ, సేవల రంగం వాటా 85 శాతం దాటినప్పుడే ‘వికసిత్ భారత్’ లక్ష్యం నెరవేరుతుందని స్పష్టం చేశారు. రెండు రంగాల ప్రపంచ సగటు వాటా 91.5 శాతంగా ఉందని, ఈ లక్ష్యాన్ని సాధించడానికి వ్యవసాయం, పెట్టుబడులు.. రెండింటికీ సంబంధించిన అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.

ఆహార రంగంలో స్వయం సమృద్ధిని సాధించడంతోపాటు వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు సీఎం జగన్. అన్ని రాష్ట్రాలూ ఒక జట్టుగా పని చేయాలని, ప్రతి రాష్ట్రం శ్రేయస్సు మొత్తం దేశంతో ముడిపడి ఉంటుందని చెప్పారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.