National

బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక భేటీ: 2024 ఎన్నికలపై దిశానిర్దేశం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం దేశ రాజధానిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు.

ఈ సమావేవంలో ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రధాని మోడీ ఆరా తీశారు.

2024 లోక్‌సభ ఎన్నికలకు ఎలా సమాయత్తమవ్వాలన్న దానిపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. మరింతగా ప్రజల మద్దతు సంపాదించడం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనేదానిపై చర్చించినట్లు తెలిసింది. బీజేపీ ప్రభుత్వం లేని చోట తమ స్థానాన్ని ఎలా బలోపేతం చేసుకోవాలనే దానిపై కూడా చర్చించినట్లు సమాచారం.

ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్, హర్యానీ సీఎం మనోహర్ లాల్ కట్టర్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, నాగాలాండ్ డిప్యూటీ సీఎం యంతుంగో పట్టన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, త్రిపుర సీఎం మాణిక్ సాహా హాజరయ్యారు.

సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా కొత్త పార్లమెంట్ భవనాన్ని మోడీ ప్రారంభించిన తర్వాత ఈ సమావేశం జరిగింది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచి బీజేపీ క్షేత్రస్థాయిలో సన్నాహాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఈ అమృత కాలం భారతదేశ అభివృద్ధికి సరికొత్త మార్గాన్ని చూపిస్తుందని మోడీ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ నూతన భవనం కేవలం ఓ నిర్మానం మాత్రమే కాదని.. 140 కోట్ల మంది భారత ప్రజల ఆకాంక్షల, కలల ప్రతిబింబమని మోడీ స్పష్టం చేశారు. భారత్ దృఢ సంకల్ప సందేశాన్ని ఈ కొత్త భవనం ప్రపంచానికి తెలియజేస్తుందన్నారు.

కాగా, కొత్త కాంప్లెక్స్ నిర్మాణం వల్ల 60,000 మందికి పైగా కార్మికులకు ఉపాధి లభించిందని, వారి కష్టానికి గౌరవంగా డిజిటల్ గ్యాలరీని సృష్టించామని ప్రధాని మోడీ చెప్పారు. ఈ వేడుకను ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘కొన్నాళ్ల పరాయి పాలన మన ఆత్మగౌరవాన్ని దూరం చేసింది. కానీ నేడు భారత్‌ ఆ వలస మనస్తత్వాన్ని వదిలివేసింది. భారత్‌ ప్రజాస్వామ్యానికి తల్లి. ఇది ప్రపంచ ప్రజాస్వామ్యానికి పునాది. ప్రజాస్వామ్యం.. మన ‘సంస్కార్’, ఆలోచన, సంప్రదాయం’ అని పేర్కొన్నారు.