మణిపూర్ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న మిలిటెంట్లపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తెలిపారు. ఇవాళ ఒక్కరోజే 40 మంది మిలిటెంట్లను హతమార్చినట్లు వెల్లడించారు.
అంతేగాక, తిరుగుబాటుదారులను సీఎం బీరేన్ సింగ్ ఉగ్రవాదులతో పోల్చారు. 40 మంది ఉగ్రవాదులను కాల్చి చంపినట్లు భద్రతా బలగాల నుంచి సమాచారం అందిందని ఆయన మీడియాకు తెలిపారు.
‘సాధారణ పౌరులపై ఎమ్-16, ఏకే-47, స్పైపర్ గన్లతో ఉగ్రవాదులు దాడికి దిగుతున్నారు. గ్రామాల్లో ప్రవేశించి ఇళ్లకు నిప్పు పెడుతున్నారు. భారత సైన్యం, ఇతర భద్రతా బలగాల సాయంతో వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు 40 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి’ అని సీఎం బీరేన్ సింగ్ వెల్లడించారు. ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని సీఎం బీరేన్ సింగ్ కోరారు.
‘హింసకు పాల్పడేవారిని కుకీ మిలిటెంట్లుగా పరిగణించలేం. వాళ్లంతా ఉగ్రవాదులు. నిరాయుధులైన సాధారణ ప్రజలపై వాళ్లు కాల్పులకు తెగబడుతున్నారు’ అని బీరేన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం రాత్రి 2 గంటల సమయంలో ఇంఫాల్ లోయలోని సేక్మయి, సుంగు, ఫయేంగ్, సెరయు తదితర ప్రాంతాల్లో తిరుగుబాటుదారులు కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని ఎదురుకాల్పులు జరిపారు. ఇప్పటికీ కొన్ని చోట్ల కాల్పులు కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
కాగా, పలు వీధుల్లో గుర్తు తెలియని మృతదేహాలు చెల్లాచెదురుగా పడివున్నట్లు సమాచారం. దాదాపు 10 మంది వ్యక్తులు బుల్లెట్ గాయాలతో ఫయేంగ్ లోని రిమ్స్ ఆస్పత్రిలో చేరినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. మరోవైపు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం మణిపూర్ రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్ర, కేంద్ర బలగాలు పెద్ద మొత్తంలో ఆయన పర్యటించే ప్రాంతాల్లో మోహరించాయి. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
మణిపూర్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఎస్టీ హోదా కోసం మెయిటీ(మైతీ)లు చేసిన డిమాండ్‌కు మణిపూర్ వ్యాలీ ప్రాంతానికి చెందిన చట్ట సభ్యుల నుంచి మద్దతు లభించింది. దీంతో గిరిజన ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనలు చేపట్టారు. పలువురు దాడులకు పాల్పడటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా, మణిపూర్ జనాభాలో 53 శాతం మెయిటీ వర్గానికి చెందినవారే ఉన్నారు. మణిపూర్ వ్యాలీలో వారి ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. అయితే, బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వస్తోన్న అక్రమ వలసదారులతో తాము సమస్యలు ఎదుర్కొంటున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
కాగా, ఆదివారం ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అనేక దహన ఘటనలు నమోదయ్యాయి. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో ఆదివారం ఉదయం గుర్తు తెలియని దుండగులు భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యే ఖ్వైరక్‌పం రఘుమణి సింగ్ ఇంటిని ధ్వంసం చేసి రెండు కార్లకు నిప్పు పెట్టారు.
ఆదివారం తెల్లవారుజామున మెయిటీ ప్రాబల్యం ఉన్న ఇంఫాల్ లోయలో అనేక చోట్ల ఘర్షణలు కూడా జరిగాయి. ఆదివారం ఉదయం నుంచి కక్చింగ్‌లోని సుగ్ను, చురచంద్‌పూర్‌లోని కంగ్వీ, ఇంఫాల్ వెస్ట్‌లోని కంగ్‌చుప్, ఇంఫాల్ ఈస్ట్‌లోని సగోల్‌మాంగ్, బిషెన్‌పూర్‌లోని యాంగూపోక్పి, ఇంఫాల్ వెస్ట్‌లోని ఖుర్ఖుల్, కాంగ్‌పోక్పిలోని వైకెపిఐ వంటి వివిధ ప్రదేశాల నుంచి కూడా విచక్షణారహిత కాల్పుల నివేదికలు నమోదయ్యాయి.