ఏపీలో పొత్తుల రాజకీయం పతాక స్థాయికి చేరింది. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పొత్తులపైన ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని పవన్ కల్యాణ్ స్పష్టం చేసారు. బీజేపీ వైఖరి పైన స్పష్టత రావాల్సి ఉంది. ఈ సమయంలో ఆంధ్రా అక్టోపస్ గా పేరున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తుతో జరిగేదేంటో ఆసక్తికర విశ్లేషణ చేసారు.
పొత్తు రాజకీయం: ఏపీలో రానున్న ఎన్నికలు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీతో పాటుగా జనసేనకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. సీఎం జగన్ వైనాట్ 175 నినాదంతో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కసరత్తు ప్రారంభించారు. పవన్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలనీయను అంటూ అంటూ టీడీపీ, బీజేపీని తిరిగి కలిపేందుకు ప్రతిపాదనలు చేసారు. మూడు పార్టీలు కలిసి 2014 ఎన్నికల తరహాలో జగన్ ను ఓడిస్తామని చెబుతున్నారు. ప్రయోగాలు ఉండవని తేల్చి చెప్పారు.
పవన్ ప్రతిపాదన పైన బీజేపీ నిర్ణయం ఏంటనే ఆసక్తి కొనసాగుతున్న సమయంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తో సమావేశమయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పొత్తుల పైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. చంద్రబాబు తెలంగాణ, ఏపీకి సంబంధించి కీలక అంశాలు చర్చించారని సమాచారం.
షా తో చంద్రబాబు మంతనాలు: ఇటు పవన్ కల్యాణ్ తమ ఓటింగ్ షేర్ పెరిగిందంటూ లెక్కలు చెప్పుకొచ్చారు. ఈ నెల 14 నుంచి గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర ప్రారంభించేందుకు సిద్దమయ్యారు. ప్రకాశం నుంచి గోదావరి జిల్లాల వరకు తాము బలంగా ఉన్నట్లు వెల్లడించారు. టీడీపీ, జనసేన రెండు పార్టీల్లోని ద్వితీయ శ్రేణి నాయకత్వం తమ మధ్య పొత్తు ఖాయమనే నిర్ణయానికి వచ్చేసారు. సీట్ల సర్దుబాటు మాత్రమే మిగిలి ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి.