హైదరాబాద్: మద్యపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా కూడా చాలా మంది లిక్కర్ సేవించకుండా ఉండలేరు. పరిమితికి మించి తాగితే ఎన్నో అనర్థాలు తప్పవని తెలిసినా..
మద్యానికి బానిసగా మారి తమ ప్రాణాలకు ముప్పుతెచ్చుకుంటున్నారు. తాజాగా, ఓ వ్యక్తి మద్యం మత్తులో ఏకంగా ఫ్లైఓవర్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. వెల్డింగ్ షాపులో కార్మికుడిగా పనిచేస్తున్న భూక్యా అశోక్.. రేష్మా బేగం అనే ఓ మహిళను ప్రేమ వివాహం చేసుకుని.. కోమటిబస్తీలో నివాసం ఉంటున్నాడు. ప్రతి రోజూ మద్యం సేవించి భార్యను కొడుతూ హింసించేవాడు. అంతేగాక, మద్యం మత్తులో తాను చనిపోతానంటూ బెదరించేవాడు.
గతంలో రెండుసార్లు భార్యతో గొడవపడి బ్లేడుతో కోసుకుని బలవన్మరణానికి యత్నించాడు. సోమవారం కూడా మద్యం సేవించి భార్యను కొట్టాడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంటానని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్‌లోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫ్లైఓవర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
తీవ్రగాయాలపాలైన అతడ్ని గమనించిన స్థానికులు వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అశోక్ మృతి చెందాడని వైద్యులు నిర్ధరించారు. కాగా, ఆత్మహత్యకు పాల్పడ్డ దృశ్యాలు దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హయత్‌నగర్‌లో వృద్ధురాలి హత్యను ఛేదించిన పోలీసులు : హైదరాబాద్ నగరంలోని హయత్‌నగర్‌లో జూన్ 4న రాత్రి జరిగిన వృద్ధురాలి హత్య కేసును 24 గంటల్లోపు పోలీసులు చేధించారు. ఈ కేసులో ఇద్దర్నీ అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. బంగారు నగల కోసమే వృద్ధురాలు సత్తెమ్మను నిందితులు హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఎల్బీనగర్ డీసీపీ అనుసాయిశ్రీ చెప్పిన వివరాల ప్రకారం.. హయత్‌నగర్ తొర్రూర్ గ్రామంలో సత్తెమ్మ అనే వృద్ధురాలి హత్య కేసును కేవలం 24 గంటల్లోనే రాచకొండ పోలీసులు చేధించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా లలిత అనే మహిళను గుర్తించి.. ఆమెను అరెస్ట్ చేశారు. సత్తెమ్మ తమ ఇంట్లో ఒంటరిగా ఉందని గమనించిన లలిత, రాకేష్… ఆమెను హత్య చేసి, బంగారం దొంగిలించారు. నారాయణపేటకు చెందిన రాకేష్.. ముత్తుట్ ఫైనాన్స్‌లో ఉద్యోగం చేస్తాడని పోలీసులు తెలిపారు.
నిందితురాలు లలిత.. సత్తెమ్మ ఇంట్లో పని చేస్తుందని చెప్పారు. లలిత.. సత్తెమ్మ కాళ్లు పట్టుకోగా.. రాకేష్ గొంతు నులిమి ఆమె హత్య చేశాడని పోలీసులు తెలిపారు. సత్తెమ్మను చంపాలని నిందితులు గతంలో కూడా ప్లాన్ చేశారని, అయితే అప్పుడు వర్కౌట్ కాకపోవడంతో ఆదివారం రోజు తమ ప్లాన్‌ను అమలు చేశారు. నిందితుల నుంచి 23 తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించారు.