వాషింగ్టన్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. భారత కాలమానం ప్రకారం.. ఈ అర్ధరాత్రి దాటిన తరువాత 1:30 గంటలకు వాషింగ్టన్కు చేరుకోనున్నారు.
ఆండ్రూస్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ల్యాండ్ కానున్నారు. పలువురు ప్రవాస భారతీయులు ఆయనకు స్వాగతం పలకనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మోదీ రాకకోసం ఎన్నారైలు ఉత్సాహంగా ఎదురు చూస్తోన్నారు.
బుధవారం 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించే యోగా కార్యక్రమానికి హాజరుకానున్నారు. 180 దేశాల ప్రముఖులు ఇందులో పాల్గొననున్నారు. అనంతరం న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ డీసీకి చేరుకుంటారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్‌లో జో బైడెన్, జిల్ బైడెన్ ఇచ్చే విందుకు హాజరవుతారు.
ఈ పరిణామాల మధ్య- భారత్‌కు బిగ్ షాక్ ఇచ్చింది చైనా. లష్కరే తోయిబాకు చెందిన భయానక ఉగ్రవాది సాజిద్ మీర్‌ను గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించాలంటూ భారత్ చేసిన ప్రతిపాదనలను అడ్డుకుంది. ఈ సాజిద్ మీర్ మరెవరో కాదు- భారత్‌లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. 2008 నవంబర్ 11వ తేదీన ప్రపంచం మొత్తాన్నీ దిగ్భ్రాంతికి గురి చేసిన ముంబై దాడులు, బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి.
పాకిస్తాన్ దేశస్తుడు. అతణ్ని గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించాలంటూ భారత్ ఇటీవలే ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను అందజేసింది. 26/11 ఉగ్రదాడి వివరాలను ఇందులో పొందుపరిచింది. కసబ్ ఇచ్చిన వివరాల ఆధారంగా సాజిద్ మీర్‌ను ప్రధాన సూత్రధారిగా నిర్ధారించినట్లు భారత్ వెల్లడించింది. అతణ్ని గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించాలంటూ విజ్ఞప్తి చేసింది.