దిల్లీ: జాబిల్లిపై అన్వేషణకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగానికి ముహూర్తం ఖరారయ్యింది.
జులై 13న ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ సోమవారం అధికారికంగా వెల్లడించారు. ప్రయోగ లాంఛ్ విండో జులై 19వ తేదీ వరకు ఉందని తెలిపారు.
చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగ తేదీపై ఇటీవల అనధికారిక వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో వాటిపై స్పందించిన సోమ్‌నాథ్.. తేదీని ఇంకా నిర్ణయించలేదని తెలిపారు. తాజాగా దీనిపై దిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ”ఈసారి చంద్రుడి (Moon) ఉపరితలంపై సాఫ్ట్‌లాండింగ్‌లో విజయవంతమవుతామని విశ్వాసంగా ఉన్నాం. జులై 13-19 వరకు లాంఛ్ విండో అందుబాటులో ఉంది. తొలి రోజే ప్రయోగం చేపట్టాలని భావిస్తున్నాం” అని వెల్లడించారు.
చంద్రయాన్ (Chandrayaan) సిరీస్‌లో ఇది మూడో ప్రయోగం. జీఎస్‌ఎల్‌వీ ఎం-3 (GSLV M-3) భారీ వాహకనౌక ద్వారా ఈ ప్రయోగం చేపట్టనున్నారు. ప్రస్తుతం ఈ ప్రయోగ పనులు చివరి దశకు చేరుకున్నాయి. చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యేలా దీన్ని చేపట్టనున్నారు. ల్యాండర్-రోవర్ కాంబినేషన్తో దీన్ని ప్రయోగించనున్నారు. ఇప్పటికే చంద్రయాన్ 2లో ప్రయోగించిన ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ కక్ష్యలో తిరుగుతోంది. అదే ఆర్బిటర్‌ను చంద్రయాన్ 3కి వినియోగించుకోనున్నారు.
ఇప్పటివరకు అమెరికా (USA), రష్యా (Russia), చైనా (China) దేశాలు చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా తమ వాహకనౌకలను ల్యాండ్ చేయగలిగాయి. ఈ మైలురాయిని సాధించిన నాలుగో దేశంగా అవతరించాలని భారత్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే.. చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ఆవిష్కరించడమే లక్ష్యంగా 2019లో చంద్రయాన్-2 ప్రయోగాన్ని చేపట్టింది. అయితే చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌ల్యాండింగ్ సమయంలో విఫలమైంది. అయినప్పటికీ ఎనిమిది సాంకేతిక పరికరాలతో కూడిన ఆర్బిటర్ మాత్రం ఇంకా కక్ష్యలో విజయవంతంగా తిరుగుతోంది. ఇక, అంతకుముందు.. 2008లో చంద్రయాన్-1 (ల్యాండర్ లేకుండా ఆర్బిటర్, ఇంపాక్టర్‌తో జరిపిన ప్రయత్నం)ను చేపట్టింది. అది విజయవతంగా జాబిల్లి ఉపరితలంపై నీటి జాడలను గుర్తించింది. అయితే, అది రెండేళ్ల పాటు పనిచేసే విధంగా రూపొందించినప్పటికీ.. దాదాపు ఏడాదిలోనే దాంతో సంబంధాలు తెగిపోయాయి. చంద్రుడి చుట్టూ తిరుగుతూ మొత్తం 312 రోజులు సేవలు అందించిన తర్వాత.. ఆ మిషన్ ముగిసినట్లు ఆగస్టు 2009లో ఇస్రో ప్రకటించింది. తాజాగా చేపడుతోన్న చంద్రయాన్ 3 ఈ మిషన్ విజయవంతమైతే మాత్రం భారత అంతరిక్ష పరిశోధనలో కీలక అడుగుపడినట్లే.