National

2040కి రూ.8 లక్షల కోట్లు: మేనమామ స్పేస్ స్టేషన్ లకు ఇస్తున్న గిఫ్ట్

“గ్రహరాశులనధిగమించి.. ఘనతారల పథము నుంచిగగనాంతర రోదసిలో గంధర్వగోళ తతుల దాటి
చంద్ర లోకమైనా..
దేవేంద్ర లోకమైనా
చంద్ర లోకమైనా..
దేవేంద్ర లోకమైనా
బొందితో జయించి మరల భువికి తిరిగి రాగలిగే

మానవుడే.. మహనీయుడు.. మానవుడే.. మహనీయుడు
శక్తియుతుడు.. యుక్తిపరుడు..
మానవుడే మహనీయుడు”

ISRO’s revenue : ఈ శ్లోకాన్ని నిజం చేసేలాగా ఇస్రో నిన్న చంద్రుడి మీద మూడు రంగుల జెండాను రెపరెపలాడించింది. చంద్రుడి దక్షిణ ధ్రువం మీద మీసం మేలేసి నిలబడింది. చంద్రుడి కోసం మనం ఇంత చేస్తున్నాం కదా.. మరి మన మేనమామ అయిన చంద్రుడు స్పేస్ స్టేషన్ లకు ఏమిస్తున్నాడు అంటే..

అంతరిక్ష రంగంలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఇస్రో కీర్తి పతాకం అంతర్జాతీయ విపణిలో రెపరెపలాడిపోతోంది. శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టడానికి విదేశీ అంతరిక్ష పరిశోధన సంస్థలకు అయ్యే ఖర్చులో మూడో వంతుతోనే ఇస్రో పని ముగించగలుగుతుండడంతో పలు దేశాలు తమ ఉపగ్రహ ప్రయోగాలకు భారత్‌కే క్యూ కడుతున్నాయి. ఫలితంగా భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ విలువ నానాటికీ పెరుగుతోంది. చంద్రయాన్‌-3 సక్సెస్ తో.. ఉపగ్రహ ప్రయోగాల కోసం మన దేశానికి వచ్చే దేశాల సంఖ్య.. తద్వారా మన అంతరిక్ష మార్కెట్‌ విలువ ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రూ.66 వేల కోట్లుగా ఉన్న ఇండియన్‌ స్పేస్‌ ఎకానమీ విలువ 2025 నాటికి 13 బిలియన్లకు పెరుగుతుందని అంచనా. అంటే రూ.లక్ష కోట్లకు పైమాటే. 2040 నాటికి అది 100 బిలియన్‌ డాలర్లకు.. అంటే రూ.8.25 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని ప్రముఖ అంతర్జాతీయ మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌ సంస్థ ‘ఆర్థర్‌ డి లిటిల్‌’ అంచనా వేసింది. ఆ సంస్థ అధ్యయనం ప్రకారం ప్రపంచ అంతరిక్ష మార్కెట్‌ విలువ ఏటా 20 శాతం వృద్ధిని నమోదు చేస్తుండగా.. మన అంతరిక్ష మార్కెట్‌ విలువ 40 శాతం మేర పెరుగుతూ రావడం గమనార్హం.

2021 నాటికి..

2021 నాటికి దాదాపు రూ.31 లక్షల కోట్లుగా ఉన్న ప్రపంచ అంతరిక్ష రంగ మార్కెట్‌ విలువ.. 2040 నాటికి 1 ట్రిలియన్‌ డాలర్లకు అంటే దాదాపుగా రూ.82.5 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని మోర్గాన్‌ స్టాన్లీ, సిటి, యూబీఎస్‌ వంటి సంస్థలు అంచనా వేశాయి.

నాసా బాటలో భారత్‌
అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు ద్వారాలు తెరవడంలో నాసా విధానాలనే అనుసరించాలని భారత్‌ భావిస్తోంది. ఉదాహరణకు అక్కడ.. ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ సంస్థ స్టార్‌షిప్‌ రాకెట్లతో ఉపగ్రహ ప్రయోగాలు చేస్తోంది. అమెరికా అంతరిక్ష సంస్థలు అస్ర్టోబోటిక్‌, ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ కూడా లూనార్‌ ల్యాండర్లను రూపొందించే పనిలో ఉన్నాయి. 2021 మే నాటికి భారత్‌లో 368 స్పేస్‌ టెక్‌ కంపెనీలున్నాయి. అమెరికా, యూకే, కెనడా, జర్మనీ తర్వాత.. ఇన్ని ప్రైవేటు స్పేస్‌ టెక్‌ కంపెనీలు ఉన్న దేశం మనదే.