TELANGANA

స్థాయికి మించి భజన చేసినా టికెట్‌ దక్కకపాయే

మా సార్‌ తెలంగాణ బాపు. తెలంగాణ జాతి పిత. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిండు. చావు నోట్లో తలకాయ పెట్టి వచ్చిండు. ఆయన చేతిలోనే తెలంగాణ పచ్చగా ఉంటుంది.

పదికాలాల పాటు చల్లగా ఉంటుంది. ఈ మాటలన్నది బీఆర్‌ఎస్‌ నాయకుడో, ఎమ్మెల్యేనో, మంత్రో కాదు. సాక్షాత్తూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కీలక అధికారిగా పని చేస్తున్న ఓ వ్యక్తి. వాస్తవానికి ఆ అధికారి నుంచి ఇలాంటి మాటలు రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎంతో ఉత్సాహంగా కేసీఆర్‌ భజన చేసిన ఆయన ఢీలా పడ్డారు. ఇంతకీ ఎందుకంటే..

గడల శ్రీనివాసరావు.. రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకుడు. ఆయన వైద్యారోగ్య శాఖకు సంబంధించి ప్రాథమిక ఆసుపత్రులను పర్యవేక్షించాలి. కానీ ఆయన ఆ పని వదిలేసి బీఆర్‌ఎస్‌ భజన చేయడం ప్రారంభించారు. అనధికార గులాబీ కార్యకర్తగా పని చేయడం ప్రారంభించారు. హైదరాబాద్‌కు కూతవేట దూరంలో ఇబ్రహీంపట్నం పీహెచ్‌సీలో కు.ని ఆపరేషన్లు విఫలమై బాలింతలు మృతి చెందినా పట్టించుకోని ఆయన.. కేసీఆర్‌ భజనలో చేయడంలో మాత్రం ఆరితేరి పోయారు. ఎలాగూ కొత్తగూడెం టికెట్‌ తనకే ధీమాతో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడం మొదలుపెట్టారు. జీఎస్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు కలరింగ్‌ ఇచ్చారు. ప్రజారోగ్య శాఖ సంచాలకుడిగా ఉండి కార్పొరేట్‌ ఆసుపత్రుల నిర్వాహకులతో వైద్యశిబిరాలు నిర్వహించడం మొదలుపెట్టారు. ఇక టికెట్‌ రావడమే ఆలస్యం అన్నట్టుగా సంకేతాలు ఇచ్చారు. కానీ ఇక్కడే కేసీఆర్‌ ఆయన మితిమీరిన గులాబీ ఉత్సాహానికి బ్రేక్‌ వేశారు.

సోమవారం బీఆర్‌ఎస్‌ రాష్ట్ర అఽధ్యక్షుడు కేసీఆర్‌ ప్రకటించిన జాబితాలో కొత్తగూడెం నియోజకవర్గం అభ్యర్థిగా వనమా వెంకటేశ్వరరావు పేరు ఉంది. దీంతో గడల శ్రీనివాసరావు నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. ఇన్నాళ్లూ ఈ నియోజకవర్గం మీద ఆశలు పెట్టుకున్న గడల.. ఒక్కసారిగి ఢీలా పడ్డారు. వాస్తవానికి టికెట్‌ వస్తుందనే ఆశతో స్థాయికి మించి వ్యాఖ్యలు చేశారు. వనమా ఇక విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కొత్తగూడెంలో రౌడీ రాజకీయం నడవదని కామెంట్లు చేశారు. ఇంటింటికీ గడల పేరుతో పాదయాత్ర కూడా చేపట్టారు. మహిళలకు పసుపుకుంకుమలు కూడా పంపిణీ చేశారు. ఇది చేసి ఒక్కరోజు కూడా కాకముందే కేసీఆర్‌ షాక్‌ ఇచ్చారు. పాపం దీని నుంచి గడల ఇంకా తేరుకున్నారో? లేదో?.