National

చంద్రయాన్ 3.. . వాట్ నెక్స్ట్: తెరపై సంచలన `మిషన్`

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. జాబిల్లిపై తన అసలు పనికి శ్రీకారం చుట్టింది. విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్ నుంచి ఇదివరకే బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టిన ప్రజ్ఞాన్ రోవర్..

తన పని తాను చేసుకోవడాన్ని మొదలు పెట్టింది.

రోవర్‌లో లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోపీ (లిబ్స్), ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్‌ను పేలోడ్స్‌గా పంపించారు శాస్త్రవేత్తలు. ల్యాండర్ మాడ్యూల్ పేలోడ్స్ ఇండియన్ లూనార్ సెస్మిక్ యాక్టివిటీ, రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్ సెన్సిటివ ఇయానోస్ఫియర్, లేజర్ రెట్రోరెఫ్లెక్టర్, చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్‌పరిమెంట్.. వంటి పరికరాలు తమ పని మొదలుపెట్టాయి. డేటాను సేకరిస్తోన్నాయి.

దీనితో పాటు సూర్యుడిపైనా సరికొత్త ప్రయోగాలకు నేడే శ్రీకారం చుట్టింది. ఆదిత్య ఎల్1 శాటిలైట్‌ను అంతరిక్షంలోకి పంపించింది. ఈ శాటిలైట్‌ను మోసుకుంటూ ఈ ఉదయం సరిగ్గా 11:50 నిమిషాలకు తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్షే ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ- సీ57 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.

ఇస్రో అంతరిక్ష ప్రయోగాలు ఈ రెండింటి వద్దే ఆగట్లేదు. మరో సంచలన మిషన్‌ను తెర మీదికి తీసుకొచ్చింది. అదే- గగన్‌యాన్. మానవ సహిత ప్రయోగం ఇది. మనుషులను అంతరిక్షంలోకి పంపించడానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్. 2024 మార్చి నాటికి ఇది కార్యరూపం దాల్చడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం గగన్‌యాన్‌కు సంబంధించిన ప్రయోగాలు శరవేగంగా సిద్ధమౌతున్నాయి. ఈ ప్రయోగం కోసం జీఎస్ఎల్వీ ఎంకే 3 రాకెట్‌ను వినియోగించనుంది. రాకెట్ క్రయోజెనిక్ ఇంజిన్‌ సామర్థ్యాన్ని ఇస్రో పరీక్షించింది కూడా. తమిళనాడులోని మహేంద్రగిరి వద్ద గల లిక్విడ్ ప్రొపల్షన్ రీసెర్చ్ సెంటర్‌లో రాకెట్ ఇంజిన్‌ సీఈ-20ని 720 సెకెండ్ల పాటు మండించింది. ఈ టెస్ట్ విజయవంతంమైనట్లు తెలిపింది.

గగన్‌యాన్‌లో భాగంగా మనుషులను లో- ఎర్త్ ఆర్బిట్‌లో ప్రవేశపెడుతుంది ఇస్రో. భూఉపరితలంపై నుంచి 400 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్తారు. అయిదు నుంచి ఏడు రోజుల పాటు అక్కడే గడుపుతారు. అనంతరం మళ్లీ భూమిపైకి తిరిగి వస్తారు. క్రూ మాడ్యుల్ అంటే.. మనుషులను తీసుకెళ్లడానికి వీలుగా ఉండే క్యాబిన్, సర్వీస్ మాడ్యుల్ అంటే.. రెండు లిక్విడ్ ప్రొపెల్లంట్ ఇంజిన్స్‌ను పేలోడ్స్‌గా పంపిస్తుంది.

ఈ ప్రయోగం విజయవంతమైతే అమెరికా, రష్యా, చైనా తరువాత మానవ సహిత మిషన్‌ను చేపట్టిన నాలుగో దేశంగా నిలుస్తుంది భారత్. మనుషులను అంతరిక్షంలోకి పంపించడం.. మళ్లీ వారిని విజయవంతంగా భూమిపైకి తీసుకుని రావడం, అంతరిక్ష పరిశోధన కేంద్రంలో సేవలను అందించడం.. ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం.