NationalWorld

యునెస్కో వరల్డ్ హెరిటేజ్ జాబితాలోకి ‘హోయసల’ ఆలయాలు

ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో భారతదేశంలోని మరో చారిత్రక కట్టడం వచ్చి చేరింది. కర్ణాటకలోని హోయసల ఆలయాలను ఈ జాబితాలో చేర్చినట్లు యునెస్కో(UNESCO) తాజాగా వెల్లడించింది.

ప్రసిద్ధి చెందిన బేలూర్, హలేబీడ్, సోమనాథ్‌పుర ఆలయాలకు కలిపి ఈ అంతర్జాతీయ గుర్తింపు ఇస్తున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం సౌదీ అరేబియాలో జరుగుతున్న 45వ వరల్డ్ హెరిటేజ్ కమిటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని శాంతినికేతన్ కు ఈ గుర్తింపు లభించిన మరుసటి రోజే హోయసల ఆలయాలకు ప్రపంచ వారసత్వ కట్టడాల చోటు లభించడం విశేషం.

హోయసలకు ఈ గౌరవం దక్కడంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో హోయసలకు చోటు లభించడం భారత్ కు ఎంతో గర్వకరణమని అన్నారు. ఆలయాలపై చెక్కిన సమాచారం, అద్భుతమైన శిల్పకళ భారత సాంస్కృతిక వారసత్వం, పూర్వీకుల కళానైపుణ్యానికి నిదర్శనం అని ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

హోయసల పవిత్ర ఆలయాలు 2014, ఏప్రిల్ 15 నుంచే యునెస్కో పరిశీలన జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం వాటి పరిరక్షణ బాధ్యతలను ఆర్కియాలాజిక్ సర్వే ఆప్ ఇండియా నిర్వర్తిస్తోంది. కాగా, తెలంగాణలోని రామప్ప ఆలయానికి గత కొంత కాలం క్రితమే యునెస్కో గర్తింపు వచ్చిన విషయం తెలిసిందే.