తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుపై సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ చంద్రబాబు నాయుడు అరెస్టుపై స్పందించారు.
చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తికే ఇలా జరిగిందంటే తనలాంటి సామాన్యుల పరిస్థితి ఏమిటని, తలుచుకుంటేనే భయమేస్తుందని హీరో విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తన తాజా సినిమా మార్క్ ఆంటోనీ సక్సెస్ మీట్ కోసం హైదరాబాద్ వచ్చిన హీరో విశాల్ చంద్రబాబు అరెస్టు గురించి జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను ఏపీలో ఓటు వెయ్యలేదని, తమిళనాడులో ఓటు వేశానని పేర్కొన్నారు.
ఒక కేసు విషయంలో చంద్రబాబు ని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారని, అయితే ఆయనను అరెస్టు చేసే విషయంలో బాగా ఆలోచించాల్సింది అని హీరో విశాల అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎందుకంటే చంద్రబాబు లాంటి ప్రముఖ రాజకీయ నేతకే ఇలా జరిగిందంటే సామాన్యుల పరిస్థితి ఏమిటనేది తలుచుకుంటే భయమేస్తుందని ఆయన పేర్కొన్నారు.
తన సినిమా ప్రచారంలో బిజీగా ఉండడం వల్ల చంద్రబాబు అరెస్టు పరిణామాలను తను లోతుగా గమనించలేదని హీరో విశాల్ పేర్కొన్నారు. ఇక చంద్రబాబు అరెస్టు విషయంలో ఏది ఏమైనప్పటికీ న్యాయమే గెలుస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తాము బయట హీరోలు కావచ్చు కానీ ఇంట్లో సామాన్యులమే అని పేర్కొన్న విశాల్ తాజాగా చంద్రబాబు అరెస్టుపై చంద్రబాబుకు మద్దతుగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
కాగా గతంలో విశాల్ రాజకీయ ప్రవేశం పై కొన్ని రూమర్లు వచ్చిన విషయం తెలిసిందే. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుప్పంలో పోటీ చేస్తాడని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఆయన తన పొలిటికల్ ఎంట్రీపై వచ్చిన వార్తలను ఎప్పటికప్పుడు ఖండించారు. కానీ ప్రస్తుతం చంద్రబాబు గురించి హీరో విశాల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రస్తుతం మళ్ళీ విశాల్ రాజకీయాలపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.