National

దేశంలో 2,000 రూపాయల నోట్ల చలామణికి పుల్ స్టాప్

ముంబై: దేశంలో 2,000 రూపాయల నోట్ల చలామణికి పుల్ స్టాప్ పడింది. ఇప్పటివరకు మనుగడలో ఉంటూ వచ్చిన ఈ పెద్ద నోటు ఇక తెరమరుగయింది. ఇకపై ఈ నోట్లేవీ మార్కెట్‌లో చెల్లుబాటు కావు.

వీటిపై ఎలాంటి లావాదేవీలను కూడా నిర్వహించలేం. అందుబాటులో ఉన్న నోట్లను మార్పిడి చేసుకోవడానికి అక్టోబర్ 7వ తేదీ వరకు గడువు ఉంది.

గతంలో సెప్టెంబర్ 30వ తేదీ నాటికే చివరి గడువు విధించింది భారతీయ రిజర్వ్ బ్యాంక్. దీన్ని మరో వారం రోజుల పాటు పొడిగించింది. అక్టోబర్ 7వ తేదీ వరకు 2,000 రూపాయల నోట్లను మార్పిడి చేసుకునే వెసలుబాటు కల్పించింది. దీని తరువాత 2,000 రూపాయల నోటు అనేది చిత్తు కాగితంతో సమానం అవుతుంది.

దేశంలో 2,000 రూపాయల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది మేలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఎలాంటి లావాదేవీలను కూడా స్వీకరించబోమని స్పష్టం చేసింది. అక్టోబర్ 8వ తేదీ నుంచి 2,000 రూపాయల నోట్ల చలామణికి పూర్తిగా బ్రేక్ పడుతుంది.

ఈ పరిస్థితుల మధ్య తాజాగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక విషయాలను వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 3.62 లక్షల కోట్ల వరకు 2,000 నోట్ల రూపాయల నోట్లు చలామణిలో ఉండేవని, మే 19వ తేదీ నాటికి ఈ సంఖ్య 3.56 లక్షల కోట్లకు తగ్గిందని తెలిపారు.

జూలై 31వ తేదీ నాటికి ఈ సంఖ్య మరింత తగ్గింది. ఆ నెల ప్రారంభంలో 3.14 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న మార్కెట్‌లో చలామణిలో ఉన్న 2,000 రూపాయల నోట్లు అదే నెల 31వ తేదీ నాటికి 0.42 లక్షల కోట్లకు పడిపోయాయి. మే 19వ తేదీ నుంచి జులై 31వ తేదీ నాటికి 88 శాతం మేర నోట్లు తమ వద్ద జమ అయినట్లు వివరించారు.

ఇంకా 12,000 కోట్ల రూపాయల విలువ చేసే 2,000 నోట్లు మార్కెట్‌లో చలామణిలోనే ఉన్నాయని శక్తికాంత దాస్ చెప్పారు. 3.37 శాతం మేర నోట్లు ఇంకా బ్యాంకుల్లో డిపాజిట్ కావాల్సి ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు 96 శాతం వరకు 2,000 నోట్లు వెనక్కి వచ్చాయని వివరించారు.

నోట్ల మార్పిడికి మరోసారి గడువు పొడిగించే అవకాశం లేదని శక్తికాంత దాస్ తేల్చి చెప్పారు. అక్టోబర్ 8వ తేదీ నుంచి ఈ నోట్ల చలామణి నిలిచిపోతుందని, బ్యాంకుల్లో డిపాజిట్ చేసే వీలు కూడా ఉండదని అన్నారు. ఎల్లుండి నుంచి రూ. 2,000 నోట్లను తీసుకోవడాన్ని బ్యాంకులు నిలిపివేస్తాయని పేర్కొన్నారు.