అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియలో ఇవాళ జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా అనూహ్యంగా ఓటమిపాలైంది. టోర్నీలో ఒక్క ఓటమి కూడా లేకుండా జైత్రయాత్ర సాగిస్తూ ఫైనల్ కు చేరిన రోహిత్ సేన..
ఫైనల్లో మాత్రం కంగారూల ప్రొఫెషనల్ ఆటతీరు ముందు చేతులెత్తేసింది. దీంతో స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు వచ్చిన లక్షమంది ప్రేక్షకులతో పాటు వందకోట్లకు పైగా భారతీయులు షాక్ లో మునిగిపోయారు.
ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమిపాలైన టీమిండియాకు టీడీపీ నేత నారా లోకేష్ అండగా నిలిచారు. వరల్డ్ కప్ లో ఆద్యంతం అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి ఫైనల్ చేరిన టీమిండియాను అభినందిస్తూ మ్యాచ్ అనంతరం లోకేష్ ఎక్స్ లో ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన భారత జట్టును ఓదార్చారు. అలాగే రోహిత్ సేన ఓటమితో బాధలో ఉన్న అభిమానులకు కూడా నారా లోకేష్ ఓ సలహా ఇచ్చారు.
క్రీడలలో, మీరు గెలుస్తారు లేదా ఓడిపోతారు. భారత్ గెలవకపోయినా, టీమ్ ఇండియా తమ అత్యుత్తమ ఆటతీరుతో ఫైనల్స్‌కు చేరుకుని క్రికెట్‌లో చిరస్మరణీయమైన క్షణాలను సృష్టించిందని లోకేష్ ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ రాత్రి, వారి విజయాలు మరియు మైలురాళ్లను వేడుక చేసుకుందామన్నారు. ప్రపంచకప్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియాకు, అలాగే టోర్నమెంట్‌లో క్రికెట్‌ను అద్భుతంగా ఆడిన టీమిండియాకు అభినందనలు అంటూ లోకేష్ పేర్కొన్నారు.