TELANGANA

ఆ ఒక్క కారణం చాలదా?: పార్టీ మార్పుపై విమర్శలకు విజయశాంతి కౌంటర్

హైదరాబాద్: పార్టీ మారారంటూ తనపై వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మాజీ ఎంపీ విజయశాంతి. ఇటీవల విజయశాంతి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో తన సోషల్ మీడియా ఖాతాలో ఆమె వెల్లడించారు.

‘రాములమ్మ పార్టీ మారారు అని విమర్శించే వాళ్ళు ఒక్కటి తెలుసుకోవాలి.

కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నపుడు 7 సంవత్సరాలు జెండా మోసి కొట్లాడింది నేను. నాడు బండి సంజయ్, కిషన్ రెడ్డి,

ఇంకొందరు బీజేపీ ప్రముఖులు అనేకసార్లు తమంత నా వద్దకు వచ్చి టిఆర్ఎస్ అవినీతిపై తప్పక చర్యలుంటాయి, మీరందరూ సమర్థిస్తే కేంద్రంలోని బీజేపీ ఎంతవరకైనా కొట్లాడతది అని చెప్పి నన్ను, వివేక్ వెంకటస్వామిని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఒప్పించి, అందుకు కేంద్ర పెద్దలతో హామీ ఇప్పించి చేర్చుకున్నది నిజం కాదా…?’ అని విజయశాంతి ప్రశ్నించారు.

‘రాష్ట్రంలోని దుర్మార్గ పాలన పోవాలి, మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బాగుంటే చాలు అన్న ఒకే ఒక్క కారణంతో సంవత్సరాలుగా పనిచేసిన కాంగ్రెస్ ను వదిలి బీజేపీకి వెళితే మాట నిలబెట్టుకోక మమ్మల్ని మోసగించి

బీఆర్ఎస్‌తో బీజేపీ అవగాహన పెట్టుకున్నది తెలిసి కదా ఇంతమంది నాయకులు రాజీనామాలు చేసి బయటకెల్లింది..?’ అని విజయశాంతి వ్యాఖ్యానించారు.

బండి సంజయ్‌ని తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించవద్దని సూచించినప్పటికీ.. పార్టీ అధిష్టానం వినిపించుకోలేదని ఇటీవల విజయశాంతి పేర్కొన్న విషయం తెలిసిందే. బండి సంజయ్‌ని తప్పించిన నాటి నుంచి బీజేపీ గ్రాఫ్ పడిపోతూ వచ్చిందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు ఇలా చేశారా? అని ఆమె మండిపడ్డారు.

మరోవైపు, ‘ధర్మపురి అరవింద్ నన్ను ఎన్నో మాటలు అన్నారు ఈ రోజు ఒక ఛానల్ తో మాట్లాడుతూ. వ్యక్తులను విమర్శించే సంస్కారం మాకు అటల్ జీ అద్వానీ జీ, నాటి బీజేపీ నేర్పలేదు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని ఇయ్యాల

తెలంగాణ సమాజం అంటున్నది అందుకు సమాధానం చెప్తే సమంజసం కావచ్చు ఎంతో కొంతైనా… నన్ను బాధపెట్టే మాటలతో విమర్శించే కన్నా…’ అని విజయశాంతి టీ బీజేపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు.