National

ఢిల్లీ ముట్టడికి లక్షలాదిగా రైతులు-మూడు రాష్ట్రాల నుంచి భారీ ర్యాలీలతో..

రాజధాని ఢిల్లీని ముట్టడించేందుకు మరోసారి ఉత్తరాది రైతులు సిద్ధమయ్యారు. ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్ కు చెందిన లక్షలాది మంది రైతులు భారీ ర్యాలీలతో దేశ రాజధాని వైపుకు కదులుతున్నారు. దాదాపు 200 రైతుసంఘాల ఆధ్వర్యంలో వీరంతా గ్రూపులుగా విడిపోయి ర్యాలీలు చేపట్టారు. రేపు (మంగళవారం) ఢిల్లీలో మహా ధర్నా నిర్వహించేందుకు వారు సిద్ధమవుతున్నారు. గతంలో కేంద్రం ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ వారు పట్టుబడుతున్నారు.

 

సంయుక్త్ కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా సహా 200 రైతుల సంఘాలు రేపు ఢిల్లీ ఛలో మార్చ్ కు పిలుపునిచ్చాయి. దీంతో మరోసారి దేశ రాజధాని రైతుల ఆందోళనలతో వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే రైతుల్ని అడ్డుకునేందుకు పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రైతు సమస్యలపై చర్చించేందుకు కేంద్రం సీరియస్ గా ప్రయత్నించకపోవడంతో ఈ ధర్నాకు మంచి స్పందన వస్తోంది.

 

రైతు సంఘాల ఢిల్లీ ఛలో మార్చ్ నేపథ్యంలో పోలీసులు, పారామిలటరీ సిబ్బందిని భారీగా మోహరించారు. భారీ బారికేడ్లు ఏర్పాటు చేసి రైతుల్ని అడ్డుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. అయితే గతంలోనూ ఇలాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా రైతులు రాజధానిలోకి ప్రవేశించారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఎర్రకోట వరకూ వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఈసారి సెక్షన్ 144 అమలు చేసి వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఢిల్లీ చలో’ మార్చ్‌లో నిరసనకారులు నగరంలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి అధికారులు సింగూ, టిక్రి, ఘాజీపూర్‌లోని దేశ రాజధాని సరిహద్దులను కోటలుగా మార్చారు.