లోక్‌సభ ఎన్నికల గడువు సమీపించి ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలో భారతీయ జనత పార్టీ.. కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ ఎన్నికల్లో భారీ విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని సాధించడానికి అవసరమైన అజెండాను ఖరారు చేస్తోంది.
జాతీయ కార్యవర్గ సమావేశాలో..
దేశ రాజధానిలోని భారత్ మండప్ వేదికగా జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అన్ని రాష్ట్రాల కార్యదర్శులు, పదాధికారులు పాల్గొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, వివిధ రాష్ట్ర శాఖ అధ్యక్షులు హాజరయ్యారు.
రెండో రోజు సమావేశాల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సన్మానించారు బీజేపీ నేతలు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా.. ఆయనకు నిలువెత్తు పూలమాలను వేసి సత్కరించారు. మోదీజీకి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. మోదీని తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు.
అధికార వాంఛ లేదు..
ఈ సమావేశంలో ప్రధాని మెదీ ప్రసంగించారు. తన స్వార్థ ప్రయోజనాలు, అధికార వాంఛతో మూడోసారి అధికారంలోకి రావాలని అనుకోవట్లేదని అన్నారు. తన సొంత ఇంటి గురించి ఆలోచించి ఉంటే దేశంలో కోట్లాది మంది పేదలకు ఇళ్లు కట్టి ఉండేవాడిని కాదని అన్నారు. పేద పిల్లల భవిష్యత్తు కోసం తాను జీవితాన్ని త్యాగం చేశానని చెప్పారు.
కలలను సాకారం చేస్తా..
కోట్లాది మంది మహిళలు, పేదలు, యువత కంటోన్న కలలను సాకారం చేయాలనే లక్ష్యంతో తాను పని చేస్తోన్నానని, అదే తన ప్రధాన సంకల్పం అని అన్నారు. ఈ 10 సంవత్సరాల పదవీ కాలంలో ఎలాంటి మచ్చ తనపై లేదని, 25 కోట్ల మంది ప్రజలను దారిద్య్ర రేఖ నుంచి బయటకు తీసుకురావడం తాను సాధించిన విజయంగా చెప్పారు మోదీ.
ఛత్రపతి స్ఫూర్తిగా..
గుజరాత్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పని చేశానని, వరుసగా రెండుసార్లు ఈ దేశానికి ప్రధాని అయ్యానని మోదీ గుర్తు చేశారు. ఇప్పటికైనా విశ్రాంతి తీసుకోవాలంటూ కొందరు పెద్దలు తనను సూచిస్తోన్నారని వ్యాఖ్యానించారు. ఛత్రపతి శివాజీని స్ఫూర్తిగా తీసుకుని అవిశ్రాంతంగా పని చేయదలచుకున్నానని పేర్కొన్నారు.
రేపిస్టులకు మరణదండన..
మూడోసారి అధికారంలో వచ్చిన తరువాత.. మానభంగాల వంటి తీవ్రమైన నేరాలకు ఉరి శిక్షను తప్పనిసరి చేస్తామని ప్రకటించారు ప్రధాని మోదీ. ఇలాంటి ఆకృత్యాలకు వేగంగా అడ్డుకట్ట వేయడానికి అవసరమైన వ్యవస్థను రూపొందిస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించాలంటూ ఎర్రకోట మీదుగా నినదించిన మొట్టమొదటి ప్రధానిని తానేనని గుర్తు చేశారు.