National

సీట్లను పంచుకున్న ఆ రెండు ప్రధాన పార్టీలు.. .

దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. మార్చి రెండో వారంలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిణామాల మధ్య పొత్తుల వ్యవహారాలు ఒక్కటొక్కటిగా తేలుతున్నాయి.

 

ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటోన్నాయి అన్ని పార్టీలు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ.. ఈ సారి గద్దెనెక్కడానికి ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహ, ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి.

 

ఈ క్రమంలో కాంగ్రెస్‌‌తో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల పొత్తు కుదుర్చుకుంది. ఈ రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాల ప్రక్రియ పూర్తయింది. తొలిదశలో చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతం సహా మొత్తంగా అయిదు రాష్ట్రాల్లో కాంగ్రెస్- ఆప్ సీట్లను పంచుకున్నాయి. దీని వివరాలను కాంగ్రెస్- ఆప్ నేతలు జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ప్రకటించారు.

 

ఢిల్లీ, గుజరాత్, హర్యానా, చండీగఢ్, గోవాల్లో ఉన్న అన్ని లోక్‌సభ స్థానాల్లో కలిసి పోటీ చేస్తాయి కాంగ్రెస్- ఆప్. ఢిల్లీ పరిధిలో మొత్తం ఏడు లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా.. వాటిల్లో మూడు చోట్ల కాంగ్రెస్ పోటీ చేస్తుంది. మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తన అభ్యర్థులను బరిలో దించుతుంది.

 

భారతీయ జనతా పార్టీ అత్యంత బలంగా ఉన్న గుజరాత్‌లో మొత్తం 26 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇందులో 24 చోట్ల కాంగ్రెస్, రెండు చోట్ల అంటే భరూచ్, భావ్‌నగర్‌లల్లో ఆప్ పోటీ చేస్తుంది. హర్యానాలో మొత్తం 10 సీట్లల్లో తొమ్మిది చోట్ల కాంగ్రెస్, కురుక్షేత్రలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తాయి. చండీగఢ్‌ను కాంగ్రెస్ తీసుకుంది. ఆప్.. మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. గోవాలో ఉన్న రెండో లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థే పోటీ చేస్తారు.