National

ఏప్రిల్ 1న రూ.2000 నోట్ల డిపాజిట్, ఎక్స్ఛేంజ్ -ఆర్బీఐ కీలక ప్రకటన..!

రూ.2 వేల రూపాయల నోట్ల విషయంలో రిజర్వు బ్యాంక్ మరో కీలక అప్ డేట్ ఇచ్చింది. ముఖ్యంగా ఈ ఆర్ధిక సంవత్సరం ఈ నెలాఖరుతో ముగియనుండటం, ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1న రూ.2 వేల రూపాయల నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు కానీ, డిపాజిట్ చేసేందుకు కానీ అనుమతించరాదని నిర్ణయించింది.

 

ప్రస్తుతం రిజర్వ్ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 19 చోట్ల ఉన్న బ్రాంచ్ లలో ఏప్రిల్ 1న రూ.2 వేల నోట్ల మార్పిడి కానీ, డిపాజిట్లు కానీ అందుబాటులో ఉండవని ఆర్బీఐ ప్రకటించింది. వార్షిక ఖాతాలను ముగించే సందర్భం కావడంతో ఏప్రిల్ 1వ తేదీన మాత్రమే ఇలా రూ.2 వేల నోట్లు తీసుకోవడం కానీ, ఇవ్వడం కానీ జరగదని ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. అయితే ఏప్రిల్ 2వ తేదీ నుంచి మాత్రం యథావిథిగా ఈ లావాదేవీలు కొనసాగుతాయని తెలిపింది.

 

వాస్తవానికి గతేడాది మే 19 నుండి అహ్మదాబాద్, బెంగళూరు, ముంబైతో పాటు ఇతర నగరాల్లో ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో కస్టమర్లు రూ.2,000 నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించారు. కానీ ఇప్పుడు వార్షిక ఖాతాల ముగింపు కారణంగా ఈ సేవను ఏప్రిల్ 1న తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. మరోవైపు ఆర్బీఐ గత ఏడాది అక్టోబర్‌ నుంచి వ్యక్తులు, వ్యాపార సంస్థలు రూ.2000 నోట్లను తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకునేందుకు అనుమతినిస్తోంది.

 

ఈ ఏడాది మార్చి 1 నాటికి మార్కెట్లో చెల్లుబాటులో ఉన్న రూ.2 వేల నోట్లలో 97.62 శాతం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్ధలోకి వచ్చేశాయి. ఇవి మొదటిసారి 2018లో మార్కెట్లోకి ప్రవేశపెట్టినప్పుడు వాటి విలువ సుమారు రూ. 3.56 లక్షల కోట్లుగా ఉంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 29 నాటికి చెలామణిలో ఉన్న ఈ నోట్ల మొత్తం విలువ రూ.8,470 కోట్లకు పడిపోయింది. కరెన్సీ వ్యవస్థ సజావుగా సాగేలా క్లీన్ నోట్ పాలసీని నిర్వహించడానికి ఆర్‌బీఐ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ తగ్గింపు జరిగింది.