AP

ఏపీ డీఎస్సీ పరీక్షలు, టెట్ ఫలితాలపై ఈసీ కీలక నిర్ణయం..!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ డీఎస్సీ పరీక్షల నిర్వహణ విషయంలో అభ్యర్ధులకు సస్పెన్స్ తొలగిపోయింది. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం ముందుగా నిర్వహించిన టెట్ పరీక్షల ఫలితాల వెల్లడితో పాటు డీఎస్సీ పరీక్షల నిర్వహణపైనా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఈసీ ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆదేశాలు పంపింది.

 

రాష్ట్రంలో ఎన్నికలకు ముందే డీఎస్సీ నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేసినా హడావిడిగా పరీక్షల నిర్వహణకు హైకోర్టు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే నిర్వహించిన టెట్ పరీక్షల ఫలితాలు వెల్లడి కాలేదు. అలాగే డీఎస్సీ పరీక్షల తేదీలు కూడా ఓసారి మారాయి. మారిన తేదీల ప్రకారం ఇవాళ్టి నుంచి డీఎస్సీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై ఓ నిర్ణయం తీసుకోవాలని ఈసీని ప్రభుత్వం కోరింది. అయితే ఈసీ ఆలస్యం చేయడంతో ఇవాళ డీఎస్సీ వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

సాయంత్రానికి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో డీఎస్సీ పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి సమాచారం ఇచ్చింది. దీంతో పాటు ఇప్పటికే నిర్వహించిన టెట్ పరీక్షల ఫలితాలను కూడా వెల్లడించవద్దని సూచించింది. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి, కోడ్ ఎత్తేశాక పరీక్షల నిర్వహణతో పాటు ఫలితాల వెల్లడి కూడా చేయాలని సీఈవోకు సూచించింది. దీంతో డీఎస్సీ, టెట్ పరీక్షలపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది.