AP

ఎన్నికల వేళ వాలంటీర్లకు ఈసీ బిగ్ షాక్ – సంచలన ఆదేశాలు..!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వాలంటీర్లకు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియలో వారిని జోక్యం చేసుకోకుండా కట్టడి చేస్తున్న ఎన్నికల సంఘం ఇవాళ మరో షాకిచ్చింది.

 

ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో విపక్ష పార్టీలన్నీ వాలంటీర్లపై భారీ ఎత్తున ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

 

రాష్ట్రంలో నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు ఏర్పాటైన సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్ధ వాలంటీర్లపై ఈసీకి ఫిర్యాదులు చేసింది. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం.. కీలక ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టులో సిటిజన్ ఫర్ డెమోక్రసీ దాఖలు చేసిన పిటిషన్, దానిపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రస్తావిస్తూ.. వాలంటీర్ల విషయంలో తగు చర్యలు తీసుకోవాలని ఏపీ సీఈవోను ఈసీ ఆదేశించింది.

 

వాలంటీర్లను రాష్ట్రంలో పెన్షన్ల సహా ఎలాంటి నగదుతో లింక్ ఉన్న సంక్షేమ పథకాల పంపిణీలోనూ వాడొద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్ ముగిసేవరకూ వాలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ ఫోన్లు, ట్యాబ్ లు, మరే ఇతర ఎలక్ట్రానికి పరికరాలు అయినా జిల్లా ఎన్నికల అధికారుల వద్ద డిపాజిట్ చేయాలని కూడా ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నడుస్తున్న సంక్షేమ పథకాల పంపిణీని నగదు బదిలీ విధానంలో చేయాలని లేదా రెగ్యులర్ ఉద్యోగులతో వీటిని పంపిణీ చేయించుకోవచ్చని సూచించింది.