National

డ్రైవర్ లేకుండా మెట్రో రైలు పరుగులు.. ఎక్కడో తెలుసా..?

లోకోపైలట్ లేకుండా నడిచే మెట్రో రైళ్లు దేశంలో తొలిసారిగా అందుబాటులోకి రానున్నాయి. ఈ సర్వీస్ మొట్టమొదటి సారిగా చెన్నైలో రానుంది. ఈ మేరకు ఆగస్టు నెలలో మొదటి డ్రైవర్ లెస్ మెట్రో రైలు పట్టాలపై పరుగులు పెట్టనుంది.

 

ఈ సందర్భంగా చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్ట్ అధికారులు మాట్లాడుతూ.. రాబోయే నెలలో అదనపు డ్రైవర్ లెస్ సెట్లు వస్తాయని వెల్లడించారు. 26 కిలో మీటర్ల మేరా 28 మెట్రో స్టేషన్లను ఈ ప్రాజెక్టులో భాగం చేయనున్నారు. ప్రయాణికులకు అనుగుణంగా ఇప్పటికే మూడు కార్ల రైళ్లను ప్రతిపాదించారు. ఆగస్ట్‌లో ఇవి రానున్నాయి. ఆ తర్వాత మరో 6 రైల్వే సెట్‌లు వస్తాయని అధికారులు తెలిపారు.

 

అధికారులు జూలై నాటికి కారిడార్‌లోని ఎలివేటెడ్ లైన్‌లో బ్యాలస్ట్‌లెస్ ట్రాక్‌ల పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. 2025లో కారిడార్-4లో ఎలివేటెడ్ స్ట్రెచ్‌ను ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా పవర్‌హౌస్‌ కనెక్టివిటీని కోడంబక్కం నుంచి పూనమల్లి బైపాస్‌ వరకు ఏర్పాటు చేయాలని చెన్నై మెట్రో యోచిస్తోంది.

 

అయితే ప్రస్తుతం పూనమల్లి మెట్రో డిపో నిర్మాణంలో ఉండగా.. 2025లో రైళ్లు నడిచేటప్పటికీ రెండో దశలో భాగంగా 138 కార్ల ట్రైన్‌సెట్‌లను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ లైన్ 116.1 కిలోమీటర్ల విస్తీర్ణంలో 2025 నాటికి దశల వారీగా పనులు ప్రారంభం కానున్నాయి.

 

మొదటి దశలో భాగంగా ఫస్ట్‌ రైళ్ల సెట్‌లను బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకొనున్నారు. ట్రాక్ సిద్ధం అయ్యే వరకు వాటిని కోయంబేడు డిపోలు ఉంచనున్నారు. ఈ నేపథ్యంలో డ్రైవర్‌లెస్ రైళ్ల ఫస్ట్‌లుక్‌ను చెన్నై మెట్రో రైల్‌ అధికారులు రిలీజ్ చేశారు. ఇందులో అడ్వాన్స్ ఫీచర్లు ఉన్నాయి.

 

డ్రైవర్‌లెస్‌ మెట్రో రైలు ఫీచర్లు చూసినట్లయితే.. ఇందులో పెర్చ్ సీట్లు, రైలు లోపల మరియు బయట సీసీ కెమెరాలు ఉన్నాయి. అంతేకాకుండా మహిళల కోసం ప్రత్యేకంగా వివిధ రంగుల్లో సీట్లు, హ్యాండిల్స్ రూపొందించారు.

 

అంతేకాకుండా ఇందులో దివ్యాంగుల కోసం కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు. లాంగ్ వెయిట్ ప్రెస్ బటన్‌తో పాటు రియల్ టైం రూట్ మ్యాప్‌లను ఏర్పాటు చేశారు. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఎల్‌సీడీ స్క్రీన్‌లు కూడా ఉన్నాయి. కాగా రైలు ప్రతి సెట్‌లో 1,000 మంది ఒకేసారి ప్రయాణించవచ్చు. ఈ ట్రైన్ గంటకు 90. కిమీ వేగంతో ప్రయాణిస్తుంది.