పరిసరాల పరిశుభ్రత ఎలాగూ పాటించని నేతలున్న దేశం మనది… అలాంటిది చట్టాలు చేసే సభలను అయినా గౌరవంగా చూసుకోవాల్సి ఉంటుంది. అక్కడ పరిశుభ్రత పాటించడం అంటే కోట్ల మంది ప్రజలకు సందేశాన్ని ఇస్తున్నట్లే.. కానీ, బుద్ధిలేని ఓ ఎమ్మెల్యే ఏకంగా చట్టసభలోనే పాన్ నమిలి ఉమ్మేశాడు. సభ అనుకున్నారో లేక తానుండే ఇళ్లు అనుకున్నారో కానీ కనీసం ఆలోచన లేకుండా.. విధాన సభ ఎంట్రీ దగ్గర పాన్ నమిలి ఉమ్మేసి.. చట్టం గురించి, ప్రజల గురించి చర్చించేందుకు సభలోకి వెళ్లిపోయాడు. ఈ విషయం తెలిసిన స్పీకర్.. స్వయంగా ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి, సదరు ఎమ్మెల్యేకు బుద్ది చెప్పారు. ఈ ఘటన.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వార్తలు బయటకు రావడంతో.. సోషల్ మీడియాలో గట్టిగానే వాయించేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా సభలో మాట్లాడుతూ కొంతమంది ఎమ్మెల్సీలు పాన్ నమిలి విధానసభ హాలులో ఉమ్మివేశారని తెలిపారు. సభ ప్రారంభానికి ముందు సభ్యులను ఉద్దేశించి ప్రసంగించిన స్పీకర్.. ఈ విషయం తెలిసిన వెంటనే తానే స్వయంగా ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసినట్లుగా వెల్లడించారు. ఇలాంటి పనులు మంచివి కాదన్న స్పీకర్.. సీసీ టీవీలో ఆ ఎమ్మెల్యేను గుర్తించినట్లు తెలిపారు. కానీ.. అతని గౌరవాన్ని కాపాడేందుకు పేరు చెప్పడం లేదని అన్నారు. సభ్యుల్లో ఎవరైనా ఇలా చేస్తుంటే.. వారిని నిలువరించాలని సభ్యులందరినీ కోరారు. అసెంబ్లీని శుభ్రంగా ఉంచడం అందరి బాధ్యత అని గుర్తు చేశారు.
ఈ విషయమై సభలోనూ సభ్యుల మధ్య చర్చ జరిగింది. అలా పాన్ ఉమ్మివేయడాన్ని తప్పుపట్టారు. ఈ సందర్భంగానే గతంలో జరిగిన ఓ విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. 2017లో యూపీ సీఎంగా ఉన్న యోగి ఆదిత్యనాథ్.. లక్నోలోని సీఎం పాత కార్యాలయాన్ని సందర్శించారు. అప్పుడు మెట్ల వెంబడి పాన్ ఉమ్మి వేయడాన్ని గుర్తించారు. అపరిశుభ్రంగా.. మెట్ల మార్గం మొత్తం పాన్ మరకలతో నిండిపోయింది. ఆ తర్వాత.. కార్యాలయం గోడలు, గదుల్లోనూ పాన్ మసాలా మరకలు కనిపించడంతో.. యోగీ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దాంతో.. 2017లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పాన్ నమలడం, గుట్కా, పొగాకు వినియోగాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
దేశంలో శుభ్రత వైపు అడుగులు వేస్తుంటే.. రాష్ట్రంలో మాత్రం ఎక్కడ చూసినా పాన్ మరకలు కనిపించడాన్ని అప్పట్లో సీఎం తప్పుపట్టారు. ఆ వెంటనే యూపీలోని పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులలో కూడా పాన్, పొగాకు ఉత్పత్తులను నిషేధిస్తూ యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి యూపీలో పాన్ మరకలు చాలా సర్వసాధారణం. ఎక్కడ చూసినా పాన్, గుట్కా మరకలు కనిపిస్తుంటాయి. అక్కడి అధికారులే వాటిని నములుతుండడంతో.. ఇక ఆఫీసులో కింద స్థాయి ఉద్యోగులు, సిబ్బందిని నియంత్రించే వాళ్లే కరవయ్యారు. అలా.. ప్రభుత్వ కార్యాలయాల్లో నిషేధానికి గురైన పాన్ మసాల వినియోగాన్ని… పేరు చెప్పని యూపీ ఎమ్మెల్యే ఏకంగా విధాన సభలోనే ఉమ్మివేసి.. మరోసారి చర్చను లేవనెత్తారు.