రక్షణరంగ ఉత్పత్తుల ఎగుమతుల విషయంలో భారత దేశం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. 2021-22లో ఎన్నడూ లేని విధంగా రక్షణరంగ ఉత్పత్తుల ఎగుమతుల విలువ రూ. 14వేల కోట్లుగా నమోదైంది. ఈ విషయాన్ని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. మిలిటరీ హార్డ్‌వేర్‌ను మిత్రపక్షాలకు ఎగుమతి చేసే విషయంలో ప్రభుత్వం చేపట్టిన సరళమైన విధానాల వల్ల ఈ రికార్డు సాధ్యమైందని అన్నారు. రక్షణరంగ ఉత్పత్తుల ఎగుమతులు.. 2014లో కేవలం రూ. 900కోట్లుగా ఉండేవని, ఇప్పుడు రూ. 14వేల కోట్లకు చేరిందని రాజ్‌నాథ్ తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న నిరంతర కృషికి ఇది నిదర్శనమని స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ ఇదే కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. India Defence exports : “2023 నాటికి రక్షణరంగ ఉత్పత్తుల ఎగుమతుల విలువ రూ. 19వేల కోట్లకు చేరుతుంది. 2025 నాటికి ఆ విలువ రూ. 25వేల కోట్లకు చేరాలన్న టార్గెట్‌ను ముందే పెట్టుకున్నాము.
ఆ లక్ష్యాన్ని చేరుకుంటామని నమ్మకంగా ఉంది,” అని రాజ్‌నాథ్ తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ కారణంగా.. తయారీపై భారత దేశం ఎక్కువ దృష్టిపెట్టిందన్న రాజ్‌నాథ్ సింగ్.. ఐఎన్ఎస్ విక్రాంత్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను దేశం పూర్తిచేస్తోందని హర్షం వ్యక్తం చేశారు. రక్షణరంగంతో పాటు దేశాభివృద్ధికి తోడ్పడే విధంగా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తున్నట్టు చెప్పిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. అదే సమయంలో ‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్’ అనే నినాదంతో విదేశీ కంపెనీలను సైతం ఆకర్షిస్తున్నట్టు స్పష్టం చేశారు. Rajnath Singh Defence exports : 2017- 2021 మధ్యకాలంలో భారత దేశ రక్షణరంగ ఉత్పత్తుల ఎగుమతుల విలువ ఆరు రెట్లు పెరిగింది. రూ. 1,520 కోట్ల నుంచి 8,435కోట్లకు చేరిందని రక్షణశాఖ డేటా వివరిస్తోంది.
ఈ నేపథ్యంలో భారత దేశ జీడీపీ అంచనాలపైనా మాట్లాడారు రాజ్‌నాథ్ సింగ్. “2014 ముందు వరకు.. బలహీనమైన 5 దేశాల జాబితాలో భారత్ ఉండేది. దీనికి ‘ఫ్రజైల్ 5’ అని పేరు పెట్టింది ప్రముఖ పెట్టుబడుల సంస్థ మోర్గాన్ స్టాన్లీ. ఇప్పుడు ఆ జాబితాలో భారత్ లేదు. ఉండదు కూడా! మనం అద్భుతమైన 5 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్నాము. 2027 నాటికి.. యూఎస్, చైనా తర్వాత మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా అవతరిస్తుందని నివేదికలు బయటకొస్తున్నాయి. రానున్న 10ఏళ్లల్లో ఇండియా జీడీపీ 8.5ట్రిలియన్లకు చేరుతుంది. ఇది భారత్ సత్తాకు చిహ్నం,” అని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. India defence exports news : కొవిడ్ సంక్షోభంలోనూ.. దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటంతో.. ఎఫ్‌డీఐ(ఫారిన్ డైరక్ట్ ఇన్వెస్ట్మెంట్) ప్రవాహం రికార్డు స్థాయిలో ఉందన్నారు రాజ్‌నాథ్ సింగ్. 2021-22లో ఎఫ్‌డీఐ విలువ రికార్డుస్థాయిలో 83.6బిలియన్ డాలర్లకు చేరిందన్నారు.