SPORTS

అరుదైన ప్రదర్శనతో 15 ఏళ్ల రికార్డు బద్దలు..

ఈ ఏడాది రాజస్తాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్ 2023 సీజన్ లో విశేషంగా రాణిస్తున్న యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ చరిత్రనే తిరగరాశాడు. ఐపీఎల్ చరిత్రలో ఓ సీజన్ లో ఓ ఆటగాడూ సాధించని ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

ఇప్పటికే లీగ్ దశలో మ్యాచ్ ల్లో తన అద్భుత ప్రదర్శనతో టీమ్ కు వరంగా మారిన యశస్వీ ఇప్పుడు రాజస్తాన్ ప్లే ఆఫ్స్ కు కూడా చేరితే తాను సాధించిన రికార్డును మరింత మెరుగుపర్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

రాజస్తాన్ యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ ఈ సీజన్ లో అన్ క్యాప్డ్ ప్లేయర్ గా అడుగుపెట్టాడు. ఒక్కో మ్యాచ్ లో తన ప్రదర్శనతో రాటు దేలాడు. సీనియర్ ఆటగాళ్లకే సాధ్యం కాని రీతిలో నిలకడగా పరుగులు రాబడుతూ అత్యంత విలువైన ఆటగాడిగా మారిపోయాడు. ఈ కోవలో ఓ అరుదైన రికార్డు కూడా అందుకున్నాడు. ఓ ఐపీఎల్ సీజన్ లో అన్ క్యాప్డ్ ప్లేయర్ గా అడుగుపెట్టి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా యశస్వీ జైశ్వాల్ చరిత్ర సృష్టించాడు. ధర్మశాలలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 ఏళ్ల జైశ్వాల్ ఈ మైలురాయిని చేరుకున్నాడు.

పంజాబ్ తో జరిగిన మ్యాచ్‌లో జైస్వాల్ కేవలం 36 బంతుల్లో ఎనిమిది బౌండరీలతో 50 పరుగులు చేసి తన సూపరా్ ఫామ్ కొనసాగించాడు. 138.69 స్ట్రైక్ రేట్‌తో జైశ్వాల్ ఈ హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో కలిపి జైస్వాల్ 14 మ్యాచ్‌ల్లో 48.07 సగటుతో మొత్తం 625 పరుగులు చేశాడు. యశస్వీ ఈ సీజన్‌లో 163.61 స్ట్రైక్ రేట్‌తో ఓ సెంచరీ, ఐదు అర్ధ సెంచరీలు సాధించాడు. ఇందులో అతని అత్యుత్తమ స్కోరు 124. యశస్వీ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన 15 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. గతంలో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ షాన్ మార్ష్ పేరిట ఈ రికార్డు ఉంది. ఐపీఎల్ 2008లో మార్ష్ అన్‌క్యాప్‌లో ఉండి ఆస్ట్రేలియా టీమ్ లో రాకముందే 11 మ్యాచ్‌లలో 68.44 సగటుతో ఒక సెంచరీ, 5 అర్ధసెంచరీలతో 616 పరుగులు చేశాడు.

భారత్ తరఫున ఇషాన్ కిషన్ ఐపీఎల్ 2020 సీజన్‌లో 57.3 సగటుతో 516 పరుగులు చేసి ఈ జాబితాలో మూడో స్ధానంలో ఉన్నాడు. కిషన్ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 2018 సీజన్‌లో 512 పరుగులతో నాల్గవ స్థానంలో ఉన్నాడు. అతని సగటు 36.57, స్ట్రైక్ రేట్ 133.3. సూర్యకుమార్ ముంబై ఇండియన్స్ తరపున నాలుగు అర్ధ సెంచరీలు సాధించాడు. అతని అత్యుత్తమ స్కోరు 72గా నమోదైంది. దేవదత్ పడిక్కల్ కూడా 2020లో ఐపీఎల్ ఒకే సీజన్‌లో 473 పరుగులతో ఈ జాబితాలో చేరాడు.