SPORTS

రేపే చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌… భారత్ vs న్యూజిలాండ్..

చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రేపు దుబాయ్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, మ్యాచ్ జరిగే పిచ్‌ ఎలా ఉండబోతోందన్న దానిపై రెండుమూడు రోజులుగా పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా, దీనిపై ఒక స్పష్టత వచ్చేసింది. ‘బ్రాండ్ న్యూ’ పిచ్‌పై కాకుండా ‘సెమీ-ప్రెష్’ పిచ్‌ను సిద్ధం చేసినట్టు తెలిసింది.

 

రెండువారాల క్రితం అంటే ఫిబ్రవరి 23న ఈ పిచ్‌ను గ్రూప్ స్టేజ్‌లో భారత్-పాక్ మధ్య మ్యాచ్‌కు ఉపయోగించారు. దీంతో ఇప్పుడు ఇదే పిచ్‌ను సిద్ధం చేసినట్టు సమాచారం. ఆ మ్యాచ్‌లో పాక్ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 42.3 ఓవర్లోనే ఛేదించింది.

 

ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసి తన ఖాతాలో 51వ శతకాన్ని వేసుకున్నాడు. 111 బంతుల్లో 100 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. శుభమన్ గిల్ 46 బంతుల్లో 56 పరుగులు చేశాడు.