అదృష్టం అందరికీ ఒకేతీరుగా ఉండదనటానికి టీ-20 సంచలనం సూర్యకుమార్ యాదవే నిదర్శనం. అపారప్రతిభ ఉన్నా, ఏళ్ల తరబడి నిలకడగా రాణించినా భారతజట్టులో చోటు కోసం దశాబ్దకాలంపాటు నిరీక్షించాల్సి వచ్చింది…. సూర్యకుమార్ యాదవ్…ప్రస్తుతం ప్రపంచ టీ-20 క్రికెట్లో మార్మోగిపోతున్న పేరు. మిస్టర్ టీ-20, స్కై.. మిస్టర్ 360, స్కూప్ స్టార్ లాంటి ముద్దుపేర్లతో సూర్యాను అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తుంటే…క్రికెట్ విమర్శకులు, దిగ్గజాలు, వ్యాఖ్యాతలు మాత్రం గృహాంతరవాసి అంటూ, సూర్య కొట్టే షాట్లు మనుషులు ఆడే షాట్లు కావంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మరోవైపు..కేవలం 25 బాల్స్ లోనే సుడిగాలి హాఫ్ సెంచరీలతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చి వేస్తున్న సూర్యాను ఎలాపడగొట్టాలో అర్ధంకాక ప్రత్యర్థిజట్ల కెప్టెన్లు, కోచ్ లు తలలు పట్టుకొంటున్నారు.