NationalTechnology

మైక్రోసాఫ్ట్‌ బిగ్‌ షాక్‌.. 11 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన

ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఏకంగా 11 వేల మంది ఉద్యోగస్తులను తొలగించేందుకు సిద్ధం అయ్యింది. ఈ మధ్య కాలంలోనే అమెజాన్, మెటా, ట్విట్టర్ ఇలా ప్రముఖ టెక్ కంపెనీలు లే ఆఫ్ చేపట్టడం ద్వారా భారీ ఎత్తున ఉద్యోగస్తులను తొలగించిన విషయం తెలిసిందే. నేటి నుండి మైక్రోసాఫ్ట్ కూడా అదే బాటలో నడవబోతోంది. హెచ్ ఆర్, ఇంజనీరింగ్ విభాగాల్లో అత్యధికంగా తొలగింపులు ఉంటాయని సంస్థ యొక్క ప్రతినిధులు పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభంతో పాటు వచ్చే రెండేళ్ల పాటు కంప్యూటర్ ఇండస్ట్రీ తీవ్ర గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటుందని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇటీవలే ఒక సందర్భంగా హెచ్చరించిన విషయం తెలిసిందే.

డిజిటల్ కంపెనీలో సామర్థ్యాన్ని మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉందని ఇటీవలే సత్య నాదెళ్ల పేర్కొన్నారు. ఇంతలోనే 11 వేల మందిని సంస్థ నుండి తొలగించడానికి నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యంగా ఉందని నిపుణులు మాట్లాడుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న మైక్రోసాఫ్ట్ వంటి అతిపెద్ద టెక్ దిగ్గజం ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం కచ్చితంగా అది పెద్ద సంచలనమే అనడంలో సందేహం లేదు. 11 వేల మంది ఉద్యోగస్తుల భవిష్యత్తుపై ఇప్పుడు ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇండియన్స్‌ పై ఈ ప్రభావం ఎంత ఉంటుంది అనేది ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.