ఇస్రో(Indian Space Research Organisation – ISRO) లో దేశీయంగా క్రయోజెనిక్ ఇంజిన్ ను రూపొందించడానికి కృషి చేసిన కేరళకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త నంబి నారాయణన్.. ఇస్రోకు సంబంధించిన కీలక రహస్య పత్రాలను విదేశాలకు అమ్మేశాడనే ఆరోపణలపై ఆయనను 1994 నవంబర్ లో అరెస్ట్ చేశారు. నంబి నారాయణన్ తో పాటు మరో ఇద్దరు శాస్త్రవేత్తలను కూడా ఇవే ఆరోపణలపై అరెస్ట్ చేశారు. 1994 డిసెంబర్ లో ఈ కేసును సీబీఐకి అప్పగించారు. Nambi Narayanan legal fight: నంబి నారాయణన్ న్యాయ పోరాటం అయితే, ఈ కేసును తనపై అక్రమంగా బనాయించారని, తాను నిర్దోషినని పేర్కొంటూ ISRO సైంటిస్ట్ నంబి నారాయణన్ న్యాయ పోరాటం ప్రారంభించారు. కేరళ ప్రభుత్వం 2018లో ఈ కేసును పున: విచారించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో, ఈ కేసు పూర్వాపరాలను విచారించి, సమగ్ర నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ డీకే జైన్ ను కోర్టు ఆదేశించింది. 2021 మార్చిలో జస్టిస్ జైన్ తన నివేదికను సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా, కేసు నమోదు చేసి పునర్విచారణ జరపాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది.
అలాగే, ISRO సైంటిస్ట్ నంబి నారాయణన్ కు రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలని కేరళ పోలీస్ శాఖను ఆదేశించింది. నంబి నారాయణన్ పోరాటంపై ప్రముఖ నటుడు మాధవన్ రాకెట్రీ అనే సినిమా కూడా తీశారు. ISRO espionage case: పోలీసు అధికారుల బెయిల్ రద్దు ఈ నేపథ్యంలో, ISRO సైంటిస్ట్ నంబి నారాయణన్ పై అక్రమంగా ఈ గూఢచర్యం కేసు బనాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు మాజీ పోలీసు అధికారులకు కేరళ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ ను సవాలు చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దాంతో, ఆ బెయిల్ ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. నాలుగు వారాల్లోగా మరోసారి విచారణ జరపాలని కేరళ హైకోర్టును ఆదేశించింది. అప్పటివరకు, ఆ ఐదుగురు మాజీ పోలీసు అధికారులు ఆర్బీ శ్రీకుమార్, సిబి మ్యాథ్యూస్, విజయన్, థంపి దుర్గాదత్, పీఎస్ జయ ప్రకాశ్ లను అరెస్ట్ చేయవద్దని పోలీసులను జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ రవికుమార్ ల ధర్మాసనం ఆదేశించింది. నంబి నారాయణన్ పై జరిగిన ఈ కుట్రలో విదేశీ హస్తం ఉందని అనుమానిస్తున్నామని సీబీఐ కోర్టుకు తెలిపింది.