Technology

అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి.. విజయవంతం

అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని గురువారం నాడు రాత్రి భారత్ విజయవంతంగా ప్రయోగించింది.డీఆర్‌డీఓ రూపొందించిన ఈ క్షిపణినిఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుండి పరీక్షించారు. ఇంతకుముందు డిజైన్ చేసిన వాటికంటే కూడా అగ్ని-5 మిస్సైల్ బాగా తేలికగా ఉందని నిపుణులు చెప్పారు. భారత్ సామర్ధ్యాన్ని తిరిగి మరొక్కసారి అగ్ని-5 మిస్సైల్ రుజువు చేసిందని రక్షణశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ప్రయోగానికి ముందు మరియు ప్రయోగ సమయంలో బంగాళాఖాతం ప్రాంతాన్ని నోఫ్లైజోన్ గా ప్రకటించడం జరిగింది.

అయితే ఈ నెల 9 న అరుణాచల్ ప్రదేశ్ లో తవాంగ్ సెక్టార్ దగ్గర చైనా, ఇండియా ఆర్మీ మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో భారత్ సమర్థవంతంగా ప్రయోగించిన ఈ క్షిపణి పరోక్షంగా చైనాకు సవాలు విసరడమే అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఈ అగ్ని-5 మిస్సైల్ 5500 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని సునాయాసంగా చేధించగలదు. ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్, ఐసీబీఎం, అగ్ని5 లాంటివి డీఆర్‌డీఓ విజయవంతంగా అభివృద్ది చేసిన క్షిపణులు. ప్రస్తుతం అగ్ని-6 పైన డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్షిపణి భూమ్మీద నుంచి కానీ జలాంతర మార్గాల నుంచి గాని ప్రయోగించే వీలు ఉంది. పైగా ఇది 8 వేల నుంచి 10 వేల కిలోమీటర్ల వరకు ఉన్న లక్ష్యాన్ని సునాయాసంగా చేదించగలిగే శక్తి కలిగి ఉంటుందట.

రెండు దశాబ్దాల నుంచి ఎంతో కృషిచేసిన భారతదేశ శాస్త్రవేత్తలు అగ్ని-1, అగ్ని- 2, అగ్ని -3, అగ్ని -4, అగ్ని- 5 క్షిపణులను సమర్థవంతంగా నిర్మించారు. 2021లో డీఆర్‌డీఓ లేటెస్ట్ టెక్నాలజీ అణు సామర్ధ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణి అగ్ని పీ ను విజయవంతంగా పరీక్షించింది. ఇలా భారతదేశం తన అను క్షిపణులన సామర్థ్యాన్ని పెంచడం ద్వారా చైనా పాకిస్తాన్ వంటి శత్రు దేశాలకు తస్మాత్ జాగ్రత్త అని పరోక్షంగా సూచిస్తుంది. రానున్న కాలంలో ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానం భారతదేశంలో ఇంకా మెండుగా అభివృద్ధి చెందాలని పౌరులందరూ ఆశిస్తున్నారు.