TELANGANA

హైదరాబాద్ నగరంలో పేలుడు కలకలం

తెలంగాణ రాజధాని, దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్ నగరంలో పేలుడు కలకలం రేగింది. విశ్వనగరంగా మారుతున్న భాగ్యనగరాన్ని పేలుడు కలకలం భయాందోళనకు గురి చేసింది. గతంలో తీవ్రవాదులు జరిపిన పేలుడు భయాలు మరోసారి నగరంలో కనిపించాయి. అయితే గురువారం సంభవించిన పేలుడుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హైదరాబాద్ లో అందరూ చూడదగిన ప్రాంతాల్లో ట్యాంక్ బండ్ కూడా ఒకటి. ఉస్సేన్ సాగర్ అందాలను తనివితీరా ఆస్వాదించడానికి ట్యాంక్ బండ్ ఎంతో మంచి స్పాట్. అందుకే నిత్యం ఈ ప్రాంతానికి చాలామంది వస్తూ పోతూ ఉంటారు.

అయితే ఈ ట్యాంక్ బండ్ కింద ఉన్న లోయర్ ట్యాంక్ బండ్ లో హఠాత్తుగా పేలుడు శబ్దాలు వినిపించాయి. లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతం అంటే కవాడిగూడ ఏరియాలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ నుండి ఒక్కసారిగా పేలుడు శబ్దాలు వినిపించాయి. దీంతో చుట్టుపక్కలి జనాలు ఒక్కసారిగా ఘటనా స్థలానికి చేరుకోగా ఇద్దరు వ్యక్తులు రక్తపు మడుగులో కొట్టుకుంటూ కనిపించారు. స్థానికంగా చెత్త ఏరుకొని బ్రతికే తండ్రికొడుకులు ఈ ఘటనలో గాయపడినట్లు పోలీసులు గుర్తించారు. డంపింగ్ యార్డులో తండ్రికొడుకులైన చంద్రన్న, సురేష్ లు చెత్త ఏరుకునే క్రమంలో కెమికల్ డబ్బాలను కదిలించడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

ఈ ఘటనలో గాయపడిన చంద్రన్న మరియు అతని కొడుకు సురేష్ లు ఏపీలోని కర్నూలు జిల్లా నాంచార్ల గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులను వెంటనే గాంధీ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. చంద్రన్న తలకు గాయమైనట్లు తెలుస్తుండగా, కొడుకు సురేష్ చేతికి తీవ్ర గాయమైనట్లు, అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.