TELANGANA

ఎమ్మెల్సీ కవితే ప్రధాన కుట్రదారు..–:ఈడీ..

లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత ప్రధాన కుట్రదారుగా ఉన్నట్లు ఈడీ పేర్కొంది. కవిత ఆప్ ముఖ్య నేతలతో కలిసి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ, శరత్ చంద్రా సౌత్ గ్రూపును నడిపించారని ఈడీ వివరించింది. మద్యం పాలసీ ద్వారా డబ్బులు రాబట్టడానికి రూ.100 కోట్లు ముడుపులు చెల్లించినట్లు గుర్తించామని తెలిపింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మనీశ్ సిసోడియాతో కవిత ఒప్పందం కుదుర్చుకున్నట్లు విచారణలో తేలినట్లు పేర్కొంది.

 

కవిత సౌత్ గ్రూప్ సభ్యులతో కలిసి పలువురు దళారులకు ముడుపులు అందజేశారని వివరించింది. ఇందుకు ఆప్ నేతలు కవితకు ముందే మద్యం పాలసీ వివరాలు అందించారని ఈడీ వెల్లడించింది. ఈడీ కోర్టు సమర్పించిన 14 పేజీల రిపోర్టులో ఈడీ ఈ విషయాలను ప్రస్తావిచింది. ఈ రిపోర్టులో ఈ కుంభకోణంలో ప్రమోయం ఉన్నవారి వివరాలు, దర్యాప్తు సంస్థల విచారణ, మద్యం పాలసీ తయారీ, దీనిపై దాఖలైన కేసు, ఈ కేసులో అరెస్టైన వారి స్టేట్మెంట్లు, చేతులు మారిన రూ.100 కోట్లకు సంబంధించి వివరాలు ఉన్నాయి.

 

ఈడీ తన రిపోర్టులో మొత్తం 18 అంశాలను ప్రస్తావించింది. అంతేకాకుండా నిందితుల వాంగ్మూలం, వాట్సాప్ చాట్స్ సేకరించామని వివరించింది. నిందితుల స్టేట్మెంట్ ఆధారంగానే కవితను విచారించినట్లు ఈడీ తెలిపింది. సరైన సమాధానం చెప్పకపోవడం, ఆధారాలపై బుకాయించడం వల్ల కవితను అరెస్ట్ చేయాల్సి వచ్చిందని పేర్కొంది. లిక్కర్ స్కామ్ లో అరుణ్ రామచంద్ర పిళ్లై, వి. శ్రీనివాస్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బుచ్చిబాబు, మాగుంట రాఘవ, శరత్ చంద్రా రెడ్డి, సమీర్ మహేంద్ర, దినేష్ ఆరోరా వాంగ్మూలం ప్రకారమే రూ.100 కోట్లు చేతులు మారాయని ఈడీ స్పష్టం చేసింది.

 

కవిత, శరత్ చంద్రారెడ్డితో కలిసి పెట్టుబడి పెడుతున్నట్లు పిళ్లై తనకు చెప్పారని సమీర్ మహేంద్రు తెలిపారని ఈడీ గుర్తు చేసింది. ఇండో స్పిరిట్ లో కవిత భాగస్వామిగా ఉన్నారని.. ఆమె ఆప్ నేతకు రూ.100 కోట్లు ఇచ్చినట్లు ఈడీ వాదించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా తరఫున ఆప్ నేత విజయ్ నాయర్ సంప్రదింపులు జరిపినట్లు వివరించింది. ఇండో స్పిరిట్ లో కవిత తరఫున అరుణ్ పిళ్లై భాగస్వామిగా ఉన్నారని తెలిపింది.

 

ఇండో స్పిరిట్స్ లో కవితకు 33 శాతం వాటా ఉన్నట్లు ఈడీ వెల్లడించింది. కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు, మాగుంట రాఘవల మధ్య సాగిన వాట్సాప్ చాట్ జరిగిందని చెప్పింది. ఈ చాట్ లో ఇండో స్పిరిట్స్ లో కవితకు 33 శాతం వాటా ఉందని తేలిందని వెల్లడించింది. ఈ చాట్స్ ను చూపిన తర్వాత కూడా కవిత బుకాయించడంతో అరెస్ట్ చేసినట్లు ఈడీ స్పష్టం చేసింది.