TELANGANA

సికింద్రాబాద్‌లోని రాంగోపాల్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం

సికింద్రాబాద్‌లోని రాంగోపాల్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. డెక్కన్ నైట్‌వేర్ స్టోర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఉదయం 11 గంటల సమయంలో గోదాంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చేలరేగాయి. ఆ మంటలు పై అంతస్తులో ఉన్న షోరూంకు అంటుకోవడంతో భారీగా పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. బిల్డింగ్ పై అంతస్తులో ముగ్గురు వ్యక్తులు చిక్కుకున్నారు.

దీంతో వారిని కాపాడేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మూడు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెస్తున్నారు. మరోవైపు.. విశాఖపట్నం గాజువాకలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక టైర్ల షాపులో సిబ్బంది వంట చేసే సమయంలో పొయ్యిపైన పెట్రోల్ పోయడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో ఆ షాపులో ఉన్న టైర్లన్నీ పూర్తిగా దగ్ధమయ్యాయని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. ఎవరికీ ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.