బీడీ కార్మికుల జీవనోపాధి, ఆరోగ్యం, మనుగడకు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ బీడీ కార్మికులకు హామీ ఇచ్చారు. ‘హాత్ సే హాత్ జోడో’ అభియాన్‌లో భాగంగా.. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీలో షబ్బీర్ అలీ బీడీ కార్మికులు, తేకేదార్ పరిశ్రమకు సంబంధించిన ఇతరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణలోని 14 ప్రధాన బీడీ పరిశ్రమల ద్వారా దాదాపు ఏడు లక్షల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారని తెలిపారు. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం బీడీ కార్మికులలో పేదరికాన్ని నిర్మూలించడానికి లేదా వారి ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ఏమీ చేయలేదని ఆయన ఆరోపించారు. తెలంగాణలోని బీడీ కార్మికుల స్థితిగతులపై ఇటీవల జరిపిన అధ్యయనాన్ని ప్రస్తావిస్తూ.. కార్మికులు తక్కువ వేతనాలను పొందుతున్నారని, దళారుల దోపిడీని ఎదుర్కొంటున్నారని తెలిపారు. బీడీ కార్మికులకు సామాజిక భద్రత లేదన్నారు. ప్రధానంగా మహిళలు బీడీలపై ఆధారపడి జీవిస్తున్నారని.. చాలా మంది బీడీ కార్మికులు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని షబ్బీర్ అలీ తెలిపారు.
అయితే వారికి వైద్య సదుపాయాలు అందడం లేదన్నారు. కామారెడ్డితో సహా దేశంలో ఎక్కడా కనీసం బీడీ కార్మికులకు ఈఎస్‌ఐ ఆస్పత్రి లేదు. బీడీ పరిశ్రమపై 28 శాతం జీఎస్టీ విధించడంపై బీజేపీపై మండిపడ్డారు. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నప్పటికీ మొత్తం పరిశ్రమను నిర్వీర్యం చేసేందుకే ఈ చర్య తీసుకుందని ఆయన అన్నారు. పొగాకును నిరుత్సాహపరిచే పేరుతో పేద బీడీ కార్మికులను మోదీ ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో బీడీ కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అర్థం చేసుకున్నారని. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం బీడీ పరిశ్రమ నుంచి జీఎస్టీని తొలగిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని బీడీ పరిశ్రమల నుంచి కేంద్రం ఏటా రూ.100 కోట్లు సెస్ రూపంలో వసూలు చేస్తుందన్నారు. కానీ కార్మికులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేందుకు ఎలాంటి పథకాలు లేవని… బీడీ కార్మికులకు కేంద్రం సరైన వేతనాలు నిర్ణయించాలని, బీడీ పరిశ్రమకు అనుబంధంగా ఉన్న కార్మికులందరికీ పీఎఫ్ కార్డులు ఇవ్వాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.